AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో సమరశంఖం పూరించిన బీజేపీ.. ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రాలు ఇవే..!

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీ ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. ఈ ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో స్పీడ్ పెంచింది. ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రాలపై కమలనాథులు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేశారు. యువతను తమవైపు తిప్పుకునే లక్ష్యంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రధాన నినాదాలతో..

Telangana: తెలంగాణలో సమరశంఖం పూరించిన బీజేపీ.. ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రాలు ఇవే..!
Telangana BJP
Shiva Prajapati
|

Updated on: May 23, 2023 | 11:30 AM

Share

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీ ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. ఈ ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో స్పీడ్ పెంచింది. ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రాలపై కమలనాథులు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేశారు. యువతను తమవైపు తిప్పుకునే లక్ష్యంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రధాన నినాదాలతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించారు. హైదరాబాద్‌లోని చంపాపేటలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆ మేరకు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. రాష్ట్ర నేతలతోపాటు పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. 9 ఏళ్ల పరిపాలనలో ప్రధాని మోదీ సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం మే 30 నుంచి జూన్ 30 వరకు ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికీ బీజేపీ, బహిరంగ సభలు, మేధావులు, ఇతర వర్గాలను కలవడం, పోలింగ్ బూత్‌ నుంచి పార్లమెంట్ స్థాయి వరకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే..

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారుంటేనే డబుల్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. అర్హత ఉన్న యువతీయువకులందరికీ ఉద్యోగాలు కల్పించడానికి బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కొలువులు కావాలంటే కమలం రావాలని, రాష్ట్ర యువత బీజేపి వైపు నిలవాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని ప్రకటించారు బండి సంజయ్. ఖాళీగా ఉన్న 25 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి..

తెలంగాణ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రచారం చేయనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఉంటే.. డబుల్ ప్రయోజనాలు రాష్ట్రానికి చేకూరుతాయని బండి సంజయ్ పేర్కొన్నారు. రెండు చోటా ఒకే ప్రభుత్వం ఉంటే.. కేంద్రంలోని పథకాలు రాష్ట్ర ప్రజలకు చేరువవుతాయని చెప్పారు. రైతులకు, పేద ప్రజలకు, నిరుద్యోగులకు మేలు జరగాలంటే ఈసారి రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కమల దళపతి.

బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటే..

ఇకపోతే.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒక్కటే అనే అంశాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది బీజేపీ. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాదని అన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ వీక్‌గా ఉన్నచోట కేసీఆర్ కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వారికి డబ్బులు కూడా అందిస్తున్నారని ఆరోపించారాయన.

క్రమశిక్షణకు కేరాఫ్ బీజేపీ..

ఈ మధ్యకాలంలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన అధిష్టానం.. నేతలు క్రమశిక్షణతో ఉండటం కూడా చాలా ముఖ్యమని దిశానిర్దేశం చేసింది. అందుకే పార్టీ లైన్‌ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాగే టికెట్‌ కేటాయింపులపైనా క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. టికెట్లు కావాలంటే ప్రజల మధ్య ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసేవారికే గుర్తింపు లభిస్తుందని చెప్పారు. సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారాయన.

భారీ బహిరంగ సభలు..

ఇక వచ్చే నెలలో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర బీజేపీ. ఓ సభకు అమిత్‌షా మరోసభకు జేపీ నడ్డా హాజరవుతారని తెలుస్తోంది. ఈసారి తెలంగాణలో సింగిల్‌గానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..