తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కర్నాటకలో కాంగ్రెస్ ప్రకటించడంపై బజరంగ్ దళ్ భగ్గుమంటోంది. ఇప్పటికే హనుమాన్ చాలీసాతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై నిరసన తెలుపుతున్న బజరంగ్ దళ్ హైదరాబాద్‌లోనూ ఆందోళనకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ తీరుకు నిరసనగా గాంధీ భవన్ ఎదుట హనుమాన్ చాలీసా పఠించాలని బజరంగ్ దళ్ నిర్ణయించింది. మరో వైపు ప్రియాంకా గాంధీ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు గాంధీ భవన్‌లో పీసీసీ నేతలు సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 11.30 గంటలకు గాంధీ భవన్‌కు వస్తామని బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రకటించారు. మరో వైపు ఉద్రిక్తతను నివారించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు గాంధీ భవన్ దగ్గరకు వచ్చారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. తమ సంస్థను నిషేధిస్తామన్న కాంగ్రెస్ తీరుపై బజరంగ్ దళ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే, కార్యాలయం ముట్టడికి వచ్చిన బజరంగ్ దళ్ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల నినాదాలతో ఆ ప్రాంతం అట్టుడుకి పోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..