AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Auto Drivers: ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్.. సెప్టెంబర్ 7న కీలక సమావేశం!

తెలంగాణలో ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సెప్టెంబర్ 7న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు, అగ్రిగేటర్ పాలసీ, మీటర్ ఛార్జీల పెంపు, రీట్రోఫిట్మెంట్‌కు రూ.1.50 లక్షల సాయం వంటి ప్రధాన డిమాండ్లపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ చర్చలు జరగనున్నాయి.

Telangana Auto Drivers: ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్.. సెప్టెంబర్ 7న కీలక సమావేశం!
Telangana Auto Drivers
Prabhakar M
| Edited By: |

Updated on: Sep 05, 2026 | 7:38 PM

Share

తెలంగాణలో ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశాలపై చర్చించేందుకు సెప్టెంబర్ 7న సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ భేటీ జరగనుంది. డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆటో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఆటో డ్రైవర్ల సంక్షేమం, వారి డిమాండ్లపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

గత భేటీలో పలు డిమాండ్లు

ఆగస్టు 23న ఆటో యూనియన్ల జేఏసీ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రధానంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు, అగ్రిగేటర్ పాలసీ, మీటర్ ఛార్జీల సవరణ, పెట్రోల్, డీజిల్ ఆటోలను రీట్రోఫిట్మెంట్ చేయడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

సంక్షేమ బోర్డుపై చర్చ

ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశం సమావేశంలో ప్రధానంగా చర్చకు రానుంది. ఆటో డ్రైవర్లకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు అందేలా వ్యవస్థను రూపొందించే అంశంపై ప్రభుత్వం పరిశీలన చేయనుంది.

అగ్రిగేటర్ పాలసీపై చర్చ

యాప్ ఆధారిత రవాణా సేవలకు సంబంధించిన అగ్రిగేటర్ పాలసీ కూడా చర్చలో కీలక అంశంగా ఉండనుంది. ఆటో డ్రైవర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాలసీలో తీసుకోవాల్సిన చర్యలపై యూనియన్ ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

మీటర్ ఛార్జీల పెంపుపై నిర్ణయం?

ప్రస్తుతం అమల్లో ఉన్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచాలన్న డిమాండ్‌పైనా సమావేశంలో చర్చించనున్నారు. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, ఇంధన ధరల నేపథ్యంలో ఛార్జీల సవరణ అవసరమని ఆటో సంఘాలు కోరుతున్నాయి.

రీట్రోఫిట్మెంట్‌కు రూ.1.50 లక్షల సాయం

పెట్రోల్, డీజిల్ ఆటోలను రీట్రోఫిట్మెంట్ చేసుకునే కార్మికులకు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంశంపైనా సమావేశంలో చర్చించనున్నారు.

ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది

ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించిన అంశాలను సమగ్రంగా చర్చించి, డ్రైవర్లకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకునే దిశగా సమావేశం కొనసాగుతుందని చెప్పారు.

అధికారులకు మంత్రి ఆదేశాలు

సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని మంత్రి ఆదేశించారు. రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్, కార్మిక శాఖ కమిషనర్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ తదితరులు సమావేశానికి హాజరుకానున్నారు.

జేఏసీ ప్రతినిధులకు ఆహ్వానం

ఆటో యూనియన్ల జేఏసీ ప్రతినిధులకు సమావేశ సమాచారం అందించి, వారు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. ఈ భేటీలో ఆటో కార్మికుల ప్రధాన డిమాండ్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us