Telangana: జంప్‌ జిలానీలకు కొత్త టెన్షన్‌..! కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

బీఆర్ఎస్‌ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరికెపూడి గాంధీకి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు.

Telangana: జంప్‌ జిలానీలకు కొత్త టెన్షన్‌..! కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
Ktr Cm Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 04, 2025 | 8:03 PM

బీఆర్ఎస్‌ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌, ప్రకాశ్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరికెపూడి గాంధీకి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు. దీంతో వివరణ ఇచ్చేందుకు తమకు సమయం కావాలని కోరారు ఎమ్మెల్యేలు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ స్పీకర్ తాత్సారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై గత శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు .. ఈనెల 10లోగా స్పీకర్ కార్యాలయం సమాధానం చెప్పాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు శాసనసభ కార్యదర్శి..

సోమవారం ఏడుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం సంజయ్‌కుమార్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని గతంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను, కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల 10న తదుపరి విచారణ జరగనుంది.

కేటీఆర్ ఏమన్నారంటే..

కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు తమ పోరాటం ఆగదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఏడాదిలోనే ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది.

కొందరు ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదంటున్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన క్యాంప్‌ ఆఫీస్‌లో ఇంకా కేసీఆర్ ఫొటోనే పెట్టుకున్నానని చెబుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తన క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్ ఫొటోనే ఉందంటున్నారు. అయితే అనర్హత వేటుకు భయపడి ఎమ్మెల్యేలు నెమ్మదిగా ప్లేట్ ఫిరాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. లేదంటే తమ క్యాంప్ ఆఫీస్‌లలో రేవంత్ రెడ్డి ఫొటో పెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులపై.. ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ప్రొసీజర్‌లో భాగమేనన్నారు రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికల గురించి బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సిరిసిల్లలోనూ ఉప ఎన్నిక రావొచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వగా.. మంగళవారం అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం చెప్తారు. స్పీకర్ కార్యాలయం సంతృప్తి చెందుతుందా? సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..