Telangana Electiom: గురువులకే చుక్కలు చూపిస్తున్న శిష్యుడు.. ఎన్నికలవేళ వ్యక్తిగత సవాళ్లకు దిగుతున్న నేతలు

ఆ నేతలు ఒకప్పుడు గురు శిష్యులుగా ఉన్నారు. చట్టసభలకు కలిసి వెళ్లారు. కానీ పార్టీలు మారి ప్రత్యర్థులుగా మారారు. దీంతో గురువులకు శిష్యుడి నియోజక వర్గం టార్గెట్‌గా మారింది. గురు శిష్యుల డైలాగ్ వార్ రాజకీయ మంటలు రేపుతున్నాయి. మరి గురు శిష్యుల మధ్య మాటల వార్ ఎందుకు వచ్చింది..? ఇంతకీ ఏ నియోజకవర్గం..?

Telangana Electiom:  గురువులకే చుక్కలు చూపిస్తున్న శిష్యుడు..  ఎన్నికలవేళ వ్యక్తిగత సవాళ్లకు దిగుతున్న నేతలు
Komatireddy Brothers And Lingaiah
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Nov 18, 2023 | 12:16 PM

ఆ నేతలు ఒకప్పుడు గురు శిష్యులుగా ఉన్నారు. చట్టసభలకు కలిసి వెళ్లారు. కానీ పార్టీలు మారి ప్రత్యర్థులుగా మారారు. దీంతో గురువులకు శిష్యుడి నియోజక వర్గం టార్గెట్‌గా మారింది. గురు శిష్యుల డైలాగ్ వార్ రాజకీయ మంటలు రేపుతున్నాయి. మరి గురు శిష్యుల మధ్య మాటల వార్ ఎందుకు వచ్చింది..? ఇంతకీ ఏ నియోజకవర్గం..?

రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పాలని పట్టుదలగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తమ స్థానాల్లో తాము గెలవడంతోపాటు తమ వర్గానికి చెందిన అనుచరులను గెలిపించుకునే బాధ్యత బ్రదర్స్ భుజాలపై వేసుకున్నారు. ముఖ్యంగా తాము పోటీ చేస్తున్న నల్లగొండ, మునుగోడులతోపాటు పట్టున్న నకిరేకల్ పై కూడా కన్నేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్, నకిరేకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలకు చెందిన వారు. చిరుమర్తి లింగయ్యకు కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ గురువులు. అనుచరుడు చిరుమర్తి లింగయ్యను 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.

2014 ఎన్నికల్లో ఓటమిపాలైన చిరుమర్తి లింగయ్య 2018 లో తిరిగి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య రాజకీయ గురువులను కాదని బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమిపాలైన వేముల వీరేశంను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిపారు బ్రదర్స్.

గురు శిష్యుల డైలాగ్ వార్ తో నకిరేకల్ ఇప్పుడు రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. ఇక్కడ రాజకీయాలు బలంగా ఉన్నా.. ఈసారి ఎందుకో గురు శిష్యులు హద్దులు మీరి విమర్శలు చేసుకుంటున్నారు. తమను కాదని బీఆర్ఎస్ పార్టీలో చేరిన చిరుమర్తి లింగయ్యపై కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ కక్ష పెంచుకున్నారు. దీంతో నకరేకల్‌లో శిష్యుడు చిరుమర్తి లింగయ్య ఓటమే లక్ష్యంగా బ్రదర్స్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో నకిరేకల్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ చిరుమర్తి వార్ గా మారింది. ఇక్కడ మరోసారి కాంగ్రెస్ ను గెలిపించి తమ పట్టు నిరూపించుకోవాలని కోమటిరెడ్డి బ్రదర్స్ కసిగా ఉన్నారు. దీంతో గురు శిష్యుల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. నమ్మక ద్రోహం చేసిన లింగయ్యను ఓడగొడుతా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ నకిరేకల్‌లో ప్రచారం చేస్తున్నారు. మునుగోడులో నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడగొట్టిన లింగయ్యను వదిలి పెట్టను అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తాను యుద్ధం చేయడం మొదలు పెడితే లింగయ్య కాలు చేయి తీయడం కాదు.. లింగయ్యను ఖతం చేస్తా అంటూ ఘాటుగా విమర్శించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ దూకుడుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ కూడా ప్లాన్ చేస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బుతో మిడిసిపడుతున్నారని చిట్యాల రోడ్డు షో లో కేటీఆర్ విమర్శల దాడి చేశారు. నల్లగొండ మునుగోడులలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి ఖాయమని కేటీఆర్ అన్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న చిరుమర్తి లింగయ్య రాజకీయ గురువులు కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రంకెలు వేస్తున్నారు. నిన్నటి వరకు రాజకీయ విమర్శలు చేసుకున్న గురు శిష్యులు.. ఇప్పుడు వ్యక్తిగత సవాళ్లకు దిగుతున్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్.. అన్న ఒక పార్టీలో, తమ్ముడు ఇంకో పార్టీలో ఉంటే తప్పులేదు గానీ.. నకిరేకల్ అభివృద్ధి కోసం తాను పార్టీ మారితే తప్పని అనడం ఎంత వరకు కరెక్ట్‌ అని చిరుమర్తి లింగయ్య నిలదీస్తున్నారు. గతంలో తనకు కోమటిరెడ్డి బ్రదర్స్ పదవి ఇచ్చారని, ఆ పదవి పేరుతో దళితుడైన నాపై కోమటిరెడ్డి సోదరులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని ఎలా దెబ్బతీస్తారని అంటూ చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంను రౌడీ అని తిట్టి పోసిన కోమటిరెడ్డి సోదరులు, ఈరోజు తాను గొప్పవాడినని చెబితే ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. ఓటమి భయంతోనే కోమటిరెడ్డి సోదరులు మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని, కిరాయి రౌడీలతో కోమటిరెడ్డి సోదరులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. నల్లగొండ, మునుగోడు ప్రజలు కోమటిరెడ్డి బ్రదర్స్ కు గుణపాఠం చెబుతారని అన్నారు. జిల్లాలో చాలామంది రాజకీయ జీవితాన్ని ఆగం చేసిన చరిత్ర కోమటి రెడ్డి బ్రదర్స్ దని, బ్రదర్స్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. ఓట్ల పండుగకు ఊర్లల్లోకి వచ్చే టూరిస్టులని, అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను దోచుకున్న చరిత్ర కోమటిరెడ్డి సోదరులదని చిరుమర్తి ఘాటుగా విమర్శించారు.

నిన్నటి వరకు సౌమ్యంగా కనిపించిన గురు శిష్యులు ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారిపోవడం.. నియోజకవర్గంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అసలు సమయం సందర్భం లేకుండా వీరు చేసుకుంటున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు మాత్రం వేడి పుట్టిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…