Crime News: తెల్లారేసరికి విగతజీవిగా మహిళ – ఎంత దర్యాప్తు చేసినా క్లూ చిక్కలే – చివరకు
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజూర పట్టణంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. విచారణలో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు కారణమైన వ్యక్తి వివరాలు, దాని వెనుక కథ పోలీసులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో దారుణం చోటు చేసుకుంది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజూర పట్టణంలో వారం క్రితం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కర్రతో తలపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో సంచలన విషయం బయటపడింది. 40 మందిని విచారించిన పోలీసులు ఎట్టకేలకు మహిళ హత్యకు కారణం తేలడం షాక్ అయ్యారు. ఓ 17 ఏళ్ల బాలుడు సిగరెట్ కోసం ఈ ఘటనకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు.
రాజూర సీఐ సుమిత్ పరతే తెలిపిన వివరాల ప్రకారం.. రమాబాయి వార్డులో కవిత రాయపురే(53) అనే మహిళ తన ఇంట్లో కిరాణం నడుపుకొంటూ జీవనం సాగించేది. ఈ నెల 15న అర్ధరాత్రి హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుమారు 40 మందిని విచారించారు. అయినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో హత్య జరిగిన నాటి నుంచి మృతురాలి ఇంటి పరిసరాల్లో నివసిస్తున్న 17ఏళ్ల బాలుడు కనిపించలేదు. అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తానే హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. అతనికి సిగరెట్ తాగే అలవాటు ఉండగా.. తరచూ కవిత కిరాణానికి వచ్చేవాడు. హత్యకు ముందు రోజు కిరాణ షాపుకు వచ్చి సిగరెట్ ఇవ్వమని అడిగాడు. ఇప్పటికే బాకీ ఎక్కువగా ఉందని, తాను ఇవ్వనని ఆమె నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న అతను ఇంట్లో ఎవరూ లేరని నిర్దారించుకుని 15న అర్ధరాత్రి ఆమె తలపై కర్రతో గట్టిగా కొట్టడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందింది. అనంతరం భయపడి పారిపోయాడు. బాలుడిని అదుపులోకి తీసుకున్న కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




