Nizamabad: ఆ ఇల్లాలి ఆలోచన భర్త ప్రాణాన్ని నిలబెట్టింది.. కుటుంబాన్ని కాపాడింది..
ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న భర్త ప్రాణాలను వినూత్న ఆలోచనతో కాపాడుకుంది ఆ ఇల్లాలు. తమ సమస్యనే పరిష్కార మార్గంగా మలుచుకుంది. రోడ్డున పడబోయే తన కుటుంబాన్ని తిరిగి గౌరవప్రదంగా బతికేలా చేసింది. ఆమె చేసిన వినూత్న ఆలోచనకు గ్రామస్థులు, బంధు మిత్రులు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారు..ఇంతకీ ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ఏమిటి..ఆ ఇల్లాలు వేసిన ఐడియా ఏమిటి..?

నిజామాబాద్ జిల్లా కేశాపూర్ గ్రామంలో కృష్ణమూర్తి, కవిత దంపతులు నివాసం ఉంటున్నారు. కృష్ణమూర్తి ప్రభుత్వ టీచర్. ఆయన గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేసేవారు. తనకు తెలిసిన మిత్రులు నమ్మించి మోసం చేసారు. కొన్ని లోన్‌ల కోసం కృష్ణ మూర్తిని షూరిటీగా పెట్టారు. అవి చెల్లించకుండా ఉడాయించారు. దీంతో ఆ భారీ మొత్తాన్ని ఈయన చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కృష్ణమూర్తి అప్పుల పాలు అయ్యాడు. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారు. ఫైనాన్స్ కంపెనీ వారు రోజు ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేయటంతో తీవ్ర మనస్తాపం చెందాడు కృష్ణ మూర్తి
చివరికి చేసేది ఏమీ లేక తన ఇంటిని అమ్మి అప్పులు చెల్లించాలని అనుకున్నాడు. ఇల్లును అమ్మకానికి పెట్టాడు. కానీ అప్పటికే కృష్ణ మూర్తి అప్పుల్లో ఉన్నాడు అని చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ తెలియటంతో 35 లక్షల విలువ చేసే తన 300 గజాల ఇంటికి అతి తక్కువ ధరకు అందరూ అడగసాగారు. తన అవసరాన్ని ఆసరాగా చేసుకుని రేటు తక్కువకు అడిగారు. దీనికితోడు రియల్ ఎస్టేట్ భూమ్ లేకపోవటంతో ఇల్లు విక్రయం కష్టం అయింది. దారులు అన్నీ మూసుకుపోవటంతో కృష్ణ మూర్తికి ఏమీ తోచలేదు. పరువు పోతుందని ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read: రోడ్డు ప్రమాదంలో ఈ పంది చనిపోయింది అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాక్..
అప్పుడే ఆయన భార్య కవిత ఓ వినూత్న ఆలోచన చేసింది. ఇందుకోసం తన ఇంటికి లక్కి డ్రా పద్దతిలో విక్రయిద్దామని భర్తతో చెప్పింది. ఇద్దరు కలిసి నిర్ణయానికి వచ్చారు. 2 వేల రూపాయలకు ఒక కూపన్ ఇచ్చి, ఇలా 3500 సభ్యులను చేర్చాలని అనుకున్నారు. వచ్చే జనవరి 23 న గ్రామంలో అందరి సమక్షంలో డ్రా తీయనున్నారు. మొదటి బహుమతిగా తన ఇంటిని ఇవ్వనున్నారు. మరో పది ఇతర బహుమతులు కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
కృష్ణ మూర్తికి ఉన్న సర్కిల్‌కు తోడు గ్రామస్థులు కూడా సానుభూతితో ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారటంతో విదేశాల్లో ఉన్న వారు మానవత్వంతో ముందుకు వచ్చి లక్కీ డ్రా కూపన్ కొంటున్నారు. ఇలా ఇప్పటికే ఆరు వందలకు పైగా సభ్యులయ్యారు.
గ్రామస్థులు,స్నేహితులు కృష్ణ మూర్తి కుటుంబానికి సహకారం అందిస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు చేసేవారని అలాంటి వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని తెలిసి ఆదుకునేందుకు ముందుకు వచ్చామని చెప్తున్నారు. మొత్తం మీద ఒక ఐడియా ఆ కుటుంబాన్ని రోడ్డుపాలు కాకుండా ఆపిందని అందరూ చర్చించుకుంటున్నారు.

Home Lucky Draw
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
