AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య మొదటికొచ్చిన పొత్తు తిప్పలు

కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తుతిప్పలు ఇప్పట్లో తప్పేలా లేవు. సీట్ల పంపకాల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ బీఆర్‌ఎస్‌కి తోడుగా నిలిచిన వామపక్షాలు.. ఇప్పుడు కేసీఆర్ మొహం చాటెయ్యడంతో.. కాంగ్రెస్‌ పార్టీ చేయి చాచింది. కానీ.. ఏ పార్టీకి ఎన్ని సీట్లిస్తారు... ఎక్కడిస్తారు అనే చిక్కుముడి మాత్రం వీడడం లేదు.

Telangana: కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య మొదటికొచ్చిన పొత్తు తిప్పలు
Left Parties - Congress
Ram Naramaneni
|

Updated on: Oct 16, 2023 | 7:09 PM

Share

చెన్నూరు, కొత్తగూడెంతో సీపీఐ సరిపెట్టుకుంటుందా? మిర్యాలగూడ సీటు కావల్సిందే అంటున్న సీపీఎంని కాంగ్రెస్ ఎలా బుజ్జగిస్తుంది..? అటు.. పొత్తు చర్చల్లో కీలకంగా మారిన మునుగోడు పరిస్థితేంటి? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు. ఇవాళ సీపీఐ కార్యాలయంలో రాష్ట్రకార్యవర్గం సమావేశమైంది. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి సహా కీలక నేతలంతా హాజరయ్యారు. కాంగ్రెస్ కేటాయించిన సీట్ల అంశంపై వాడి వేడి చర్చ జరిగింది. మునుగోడు సీటు కేటాయించాల్సిందేనని పట్టుబట్టారు నల్గొండ జిల్లా నేతలు. నిజానికి… బెల్లంపల్లి, మునుగోడు, వైరా, కొత్తగూడెం, హుస్నాబాద్… ఈ ఐదు సీట్లు కావాలంటూ కాంగ్రెస్‌ పార్టీకి జాబితా సమర్పించుకుంది సీపీఐ.

కానీ.. సీపీఐ కోరని చెన్నూరు సీటును కేటాయించింది కాంగ్రెస్. తమకు పెద్దగా పట్టులేని చెన్నూరులో అభ్యర్థి ఎంపికపై సీపీఐలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. అటు… తమకిచ్చే సీట్లలో మునుగోడు కచ్చితంగా ఉండాలని పట్టు పడుతున్నారు సీపీఐ నేతలు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి పల్లా వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివ రావుతో వాగ్వాదం కూడా జరిగింది. -పొత్తులో ఇచ్చిన నియోజకవర్గాల్లో రెబల్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గురించి ఏఐసీసీ ప్రస్తావించకపోవడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు కామ్రేడ్లు. తనక్కావల్సిన కొత్తగూడెం వచ్చేసింది కనుక కూనంనేని ఖుషీగా ఉన్నారని, పార్టీ గురించి ఆలోచించడం లేదని మిగతా నేతలు గుర్రుగా ఉన్నారు.

ఇక సీపీఎం విషయానికొస్తే.. తమకు మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం కావాలని మొదట్నుంచీ డిమాండ్ వినిపిస్తోంది. అంతకుమించి భద్రాచలం మీద గట్టిగా ఆశలు పెట్టుకుంది సీపీఎం. కానీ… మొదటి జాబితాలోనే భద్రాచలం అభ్యర్థిని ఖరారు చేసి షాకిచ్చింది కాంగ్రెస్ పార్టీ. మునుగోడును వామపక్షాలకు ఇవ్వొద్దంటూ నల్గొండ కాంగ్రెస్ నేతల నుంచి అధిష్టానానికి అల్టిమేటమ్ వెళ్లింది. కామ్రేడ్లు కూడా ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ.. తమ డిమాండ్లను ప్రస్తావిస్తూనే ఉన్నారు. సో… ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్-లెఫ్ట్ నేతల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. అసలు… పొత్తు నిలబడుతుందా లేదా అనేదాకా వెళ్లింది చర్చ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..