Telangana: ఊరంతా కరెంట్ షాక్.. ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా..
విద్యుత్ షాక్ గురై యువకుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామంలో నివాస గృహాలకు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో తండా వాసులు ఉలిక్కిపడ్డారు. తండాలోని పలు ఇళ్లలో గృహోపకరణాలు టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయి భారీ నష్టం వాటిల్లింది.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గూడెపుకుంట తండాలో హరిలాల్ అనే యువకుడు ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫోన్ ఛార్జింగ్ పెడుతున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై హరిలాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు తండా అంతటా విద్యుత్ సరఫరా జరిగి షాక్ రావడంతో తండావాసులు ఆందోళనకు గురయ్యారు. తండాలో ఇళ్లలో ఉన్న సామగ్రికి, గోడలకు, ఇతర వస్తువులకు విద్యుత్ సరఫరా జరిగి షాక్ రావడంతో తండావాసులు ఉలిక్కి పడ్డారు.
తండాలోని పలు ఇళ్లలో గృహోపకరణాలు టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయి భారీ నష్టం వాటిల్లింది. రెండు నెలలుగా తండాలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని, వోల్టేజ్ హెచ్చుతగ్గుల గురించి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదనీ తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే హరిలాల్ ప్రాణం పోయిందని, నిరుపేద కుటుంబానికి తీరని నష్టం జరిగిందని తండావాసులు కన్నీరు మున్నీరయ్యారు.
బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలనీ తండా వాసులు, మృతుని బంధువులు హరిలాల్ మృతదేహంతో పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. ఈ ఆందోళనతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




