Weather: బాబోయ్ చలి.. తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. హైదరాబాద్‌లో సైతం కోల్డ్ వేవ్స్ వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తీవ్రమైన చలితో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెలంగాణలో గత పదేళ్ల రికార్డులను బద్దలు కొడుతూ చలి తీవ్రత కొనసాగుతోంది. దాదాపు చాలా జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులు మరింత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే 3 రోజుల పాటు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అతిశీతల గాలులతోపాటు పొగమంచు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో.. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు/ఈశాన్య దిశగాల నుండి వీచుచున్నవి. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
బుధవారం, గురువారం, శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 6-7°C కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 7-9°C కంటే తక్కువగా పడిపోవచ్చని పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




