AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అయ్యో.. ఎంత కష్టమొచ్చిందో.. స్కూల్ ఐడీకార్డుతో ఉరివేసుకొని 4th క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య!

హైదరాబాద్‌లో తీవ్ర విషాద ఘటన వెలుగు చూసింది. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి స్కూల్ ఐడి కార్డ్ టాగ్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్రూమ్‌లో విగతజీవిగా పడిన కుమారుడిని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక సమాచారంతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు చిన్నారి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: అయ్యో.. ఎంత కష్టమొచ్చిందో.. స్కూల్ ఐడీకార్డుతో ఉరివేసుకొని 4th క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య!
Sravan Kumar B
| Edited By: |

Updated on: Dec 17, 2025 | 2:24 PM

Share

చందానగర్‌లో 9ఏళ్ల బాలుడు బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆందోళనను రేపుతోంది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో చదువుతున్న చిన్నారి ప్రశాంత్ మరణానికి గల కారణాలు ఇప్పటికీ పోలీసులకు స్పష్టంగా లేవు. హైదరాబాద్ చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో 9ఏళ్ల ప్రశాంత్ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి కొద్దిసేపటికే బాత్రూంలోకి వెళ్లిన బాలుడు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి స్థానికుల సహాయంతో తలుపు ధ్వంసం చేసి లోపలికి వెళ్లింది. లోపల ఉరి వేసుకున్న స్థితిలో కనిపించిన ప్రశాంత్‌ను చూసి షాక్ అయింది. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు.

ఇక ఏం చేయాలో అర్థం కాక కుటుంబసభ్యులు చందానగర్ పోలీసులకు సమాచారమిచ్చారు, దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో బాలుడు తన స్కూల్‌ ఐడీ కార్డ్‌కు ఉన్న ట్యాగ్ సాయంతోనే ఉరి వేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నాలుగో తరగతి చదువుతున్న ప్రశాంత్ తరచూ రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్తున్నాడని, ఇటీవల చదువులోనో, ఫీజుల విషయంలోనో ఎలాంటి పెద్ద సమస్యలు తమ దృష్టికి రాలేదని కుటుంబాన్ని విచారించిన పోలీసులు పేర్కొంటున్నారు.

ఘటన తర్వాత బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మోర్టువరీకి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు ఇద్దరూ స్థానికంగా వాచ్‌మన్‌గా, గృహిణిగా జీవనం సాగిస్తున్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు BNSS సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి స్కూల్‌ వాతావరణం, టీచర్లు, స్నేహితులతో సంబంధాలు, చదువుపై ఒత్తిడి, ఫీజు బకాయిలు ఉన్నాయా అనే అంశాలన్నింటినీ విచారణలో ఖచ్చితంగా పరీక్షిస్తామని అధికారులు చెబుతున్నారు.

పిల్లల్లో డిప్రెషన్

స్కూల్‌ నుంచి స్పందన ఆలస్యమవుతోందని, బుధవారం నుంచి ప్రిన్సిపల్‌, సిబ్బందిని ప్రశ్నించి మరిన్ని వివరాలు సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లతో పాటు పొరుగువారి, స్నేహితుల వాంగ్మూలాలను కూడా తీసుకుని బాలుడి మానసిక స్థితిపై స్పష్టతకు రావాలని దర్యాప్తు బృందం చూస్తోంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యల కేసులు పెరుగుతున్నాయని, ఇది తీవ్ర మానసిక ఆరోగ్య సంక్షోభానికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు, టీనేజ్ విద్యార్థుల్లో డిప్రెషన్‌, ఆందోళన, చదువు ఒత్తిడి, అవమాన భావనలను పెద్దలు “సాధారణ అలసత్వం”గా తీసుకోవడం ప్రమాదకరమని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఈ మార్పులు గమనించండి

చిన్నారుల్లో ఆకస్మికంగా నడవడిన మార్పులు, ఒంటరిగా ఉండాలని చూడటం, స్కూల్‌కి వెళ్లేందుకు నిరాకరించడం, భయం–ఆందోళన, తరచూ ఏడ్వడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు, టీచర్లు అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. సమయానికి కౌన్సెలింగ్‌, సపోర్ట్‌ అందిస్తే చాలా కేసుల్లో ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. పిల్లలతో ప్రతిరోజూ మాటలాడి, వారి భావోద్వేగ పరిస్థితిని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మార్కుల కన్నా.. పిల్లలు ముఖ్యం.

మార్కులు, ర్యాంకులు, ఫీజులకన్నా పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా చూడాలని తల్లిదండ్రుల్ని కోరుతున్నారు. స్కూల్‌లు తప్పనిసరిగా స్టూడెంట్‌ కౌన్సెలింగ్‌, మెంటల్‌ హెల్త్‌ సెషన్లను క్యాలెండర్‌లో భాగం చేయాలనే డిమాండ్‌ పెరుగుతోంది. చందానగర్ ఘటన వంటి విషాదాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, కుటుంబం, స్కూల్, సమాజం కలిసి చిన్నారుల భావోద్వేగ భద్రతపై మరింత సున్నితంగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని బాలల హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.