Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పోలీస్ కావాలనే తన కలను నెరవేర్చుకునేందుకు భలే స్కెచ్ వేశాడు.. చివరికి ఇలా..!

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాస రావుపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో పోలీస్‌ కావాలని కలలు కన్నాడు. పదో తరగతితోనే ఆ కల నెరకపోవడంతో వక్రమార్గం పట్టాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. 15 ఏళ్ల కిందట పోలీస్‌ యూనిఫాం ధరించి మట్టపల్లి శివారులో లారీడ్రైవర్లను ఆపి డబ్బులు వసూలు చేశాడు.

Telangana: పోలీస్ కావాలనే తన కలను నెరవేర్చుకునేందుకు భలే స్కెచ్ వేశాడు.. చివరికి ఇలా..!
Fake Dsp Arrest
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Mar 11, 2025 | 10:08 AM

సాధారణంగా అందరూ కలలను కంటారు. కొందరు పొలిటికల్ లీడర్, మరికొందరు సినిమా స్టార్, ఇంకొందరు పోలీస్ ఆఫీసర్ కావాలనే కలలు కంటారు. అయితే తమ కలలను సాకారం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఆ కలలు నెరవేరకపోతే తమ పిల్లల రూపంలో ప్రయత్నిస్తుంటారు. తన కలను మరో రూపంలో సాకారం చేసుకోవడంతో పాటు ఈజీ మనీ కోసం ఈ కేటుగాడు కొత్త అవతారం ఎత్తాడు. ఆ కొత్త అవతారమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాస రావుపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో పోలీస్‌ కావాలని కలలు కన్నాడు. పదో తరగతితోనే ఆ కల నెరకపోవడంతో వక్రమార్గం పట్టాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. 15 ఏళ్ల కిందట పోలీస్‌ యూనిఫాం ధరించి మట్టపల్లి శివారులో లారీడ్రైవర్లను ఆపి డబ్బులు వసూలు చేశాడు. నకిలీ పోలీసు అని తెలుసుకున్న లారీ డ్రైవర్లు ఆయనను చితకబాదారు. దీంతో పొరుగు రాష్ట్రమైన ఏపీకి పరారయ్యాడు.

ఆ తర్వాత కొత్త అవతారం ఎత్తాడు.. తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ అధికారిలా యూనిఫాం, బెల్ట్‌, బూట్లు, బ్యాడ్జీలు ధరించి డీఎస్పీనంటూ కారులో తిరుగుతూ నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకున్నాడు. పౌరసరఫరాల శాఖ, పోలీస్‌ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను నమ్మబలికాడు. వారి నుండి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, త్రిపురాంతకం, మేడికొండూరు, నర్సరావుపేట రూరల్‌, మార్కాపురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. ఈ కేసుల్లో 2022లో జైలుకు వెళ్లి అదే ఏడాది బెయిల్‌పై విడుదయ్యాడు.

నిరుద్యోగులే టార్గెట్ గా…

తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ తాను డీఎస్పీనని ఆటోడ్రైవర్లు, హెయిర్‌ డ్రెస్సింగ్‌ సెలూన్ల యజమానులను పరిచయం చేసుకున్నాడు. వీరి ద్వారా ఎస్‌ఐ, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరోసారి మోసానికి తెరలేపాడు. ఈ క్రమంలోనే కోదాడకు చెందిన ఓ యువతి నుంచి రూ.36లక్షలు వసూలు చేశాడు. ఏపీలోని మార్టూరుకు చెందిన యువకుడు, గురజాలకు చెందిన యువకుడి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అమాయక నిరుద్యోగుల నుండి వసూలు చేసిన డబ్బుతో లగ్జరీ కార్లను అద్దెకు తీసుకుని తిరుగుతూ జల్సాలు చేస్తున్నాడు.

హోటల్ వద్ద బాధితుల వాగ్వివాదం…

గత ఫిబ్రవరి నెలలో సూర్యాపేటలో తాను డీఎస్పీనంటూ దురాజ్‌పల్లి జాతర బందోబస్తు పర్యవేక్షణకు వచ్చానని శ్రీగ్రాండ్ హోటల్ లో గదిని అద్దెకు తీసుకున్నాడు. ప్రతిరోజు పోలీస్ యూనిఫాంతో బయటికు వెళ్లి వస్తున్నాడు. రెండు వారాల పాటు ఆయన వ్యవహారం బాగానే సాగింది. కొందరు హోటల్‌ గది వద్దకు వచ్చి డబ్బు విషయంలో శ్రీనివాసరావుతో వాగ్వాదానికి దిగారు. ఇలా రెండు, మూడు రోజులు కొనసాగడంతో హోటల్‌ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. సూర్యాపేట పట్టణ పోలీసులు విచారణలో శ్రీనివాసరావు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. హోటల్‌ వద్ద ఉన్న బాధితులను కూడా పోలీసులు విచారించడంతో నకిలీ డీఎస్పీ బాగోతం బయటపడింది.

తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు..

తెలుగు రాష్ట్రాల్లోని అమాయక నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని శ్రీనివాసరావు నకిలీ డీఎస్పీ అవతారమెత్తి మోసం చేస్తున్నాడని సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. ఇతడిపై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. కోదాడ యువతీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావును అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడు నుండి రూ.18లక్షల నగదు, కారు, పోలీస్‌ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. నకిలీ పోలీసుల పట్ల నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..