Hyderabad: వీడియోలకు లైక్‌ల మీద లైక్స్ కొట్టేస్తున్నారా? ఇది వింటే గుండె జారి ప్యాంట్‌లోకి రావడం ఖాయం!

|

Jan 25, 2023 | 8:45 PM

ఒక్క లైకే కదా.. కొడితే పోలా.. అని లైక్ బటన్ మీద అలా నొక్కేస్తాం. కానీ.. అ లైకుల వెనక్కూడా ఓ దందా నడుస్తోందని ఎవరికి తెలుసు. నచ్చినా నచ్చకపోయినా వీడియోలకు లైక్స్ కొట్టి రూ. 19 లక్షలు పోగొట్టుకున్న

Hyderabad: వీడియోలకు లైక్‌ల మీద లైక్స్ కొట్టేస్తున్నారా? ఇది వింటే గుండె జారి ప్యాంట్‌లోకి రావడం ఖాయం!
Video Like
Follow us on

ఒక్క లైకే కదా.. కొడితే పోలా.. అని లైక్ బటన్ మీద అలా నొక్కేస్తాం. కానీ.. అ లైకుల వెనక్కూడా ఓ దందా నడుస్తోందని ఎవరికి తెలుసు. నచ్చినా నచ్చకపోయినా వీడియోలకు లైక్స్ కొట్టి రూ. 19 లక్షలు పోగొట్టుకున్న ఒక అభాగ్యుడి స్టోరీ వింటే.. ఇంకోసారి లైక్‌ బటన్ కనిపిస్తేనే వణుకు పుట్టడం గ్యారంటీ. ఇంతకీ ఆ లైకుల వెనుకుండే మాయజాలం ఏంటి? అసలేం జరుగుతుంది? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ ఫోన్లోనో, లాప్‌టాప్ మీదో, నచ్చిన వీడియోల్ని చూస్తూ.. బాగా నచ్చిందంటే లైక్ కొట్టడం నెటిజన్లకు అలవాటే. కానీ.. ఆ అలవాటునే తమకు అనుకూలంగా మార్చుకుని, ఆయాచితంగా నిలువుదోపిడీ చేసే స్మార్ట్ దందా ఒకటి షురూ అయ్యింది. వీళ్ల మాయలో పడి రూ. 19 లక్షలు పోగొట్టుకుని, సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర గోల పెడుతున్నాడు ఒక అమాయకుడు.

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. తన మానాన తాను ఉద్యోగం చేసుకుంటుంటే వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసే ఒక్కో వీడియోకీ లైక్‌ కొడితే 50 రూపాయలిస్తాం, కమాన్ మై బాయ్ అనేది ఆ మెసేజ్ సారాంశం. ఒక్క లైకే కదా.. కొడితే పోలా అనుకుని అలాగే చేశాడు.

ఇవి కూడా చదవండి

ముందుగా నేరగాళ్లు పంపిన 3 వీడియోల లింకుల మీద క్లిక్ చేసి.. ఇది చీటింగ్ కాదులే అనుకుని, లైక్స్ కొట్టి స్క్రీన్ షాట్లు పంపాడు. తన అకౌంట్ నంబర్‌కి 150 రూపాయలు టకీమని పడిపోయాయి. అదే ఊపులో మరో 10 వీడియోలకు లైక్స్ కొట్టేశాడు. డబ్బులెక్కడ అని అడిగితే.. 600 రూపాయలు కట్టి పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి డబ్బు పంపుతామని ఊరించారు. అలాగే ప్రిపెయిడ్‌గా మరో 3వేలు పంపితే.. టోటల్‌ రూ. 4,750 రిటర్న్ ఇస్తామని స్మార్ట్‌ చీటింగ్ మొదలుపెట్టేశారు. టెంప్ట్ అయిపోయిన మన సాఫ్ట్‌వేర్.. చెప్పినట్టే చేసి.. డబ్బు రాబట్టుకున్నాడు.

బాధితుడు దారిలోకి వచ్చాడనుకున్న సైబర్‌గాళ్లు రూ. 1.80 లక్షలు పంపు.. రూ. 3.24 లక్షలు రిటర్న్ చేస్తామన్నారు. అంతే స్పీడుగా అది కూడా కానిచ్చేశాడు. ఇంకేముంది.. రూ. 18.9 లక్షలు ప్రీపెయిడ్ కడితే ఏకంగా రూ.27 లక్షలు ఇస్తామని, బంపరాఫర్ అని చెప్పారు. ఇక్కడైనా అలర్ట్ కాకుండా రూ. 19 లక్షలూ ఒకేసారి పంపించేశాడు. డబ్బు రాలేదేమని అడిగితే సెటిల్‌మెంట్‌ ఫీజు కింద మరో 15 లక్షలు కట్టండి, మొత్తం రూ. 42 లక్షలొస్తాయని రిప్లయ్ వచ్చింది. అప్పటిగ్గాని అర్థం కాలేదతడికి తాను అడ్డంగా మోసపోయానని. వెంటనే విధి లేక పోలీసుల్ని ఆశ్రయించాడు.

కామెడీగా అనిపించినా ఇదో ఖతర్నాక్ మైండ్ గేమ్. మోసపోయే వాళ్లున్నంత వరకూ మోసపుచ్చే వాళ్లు ఉంటూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఇటువంటి దురాగతాలు కొత్తేమీ కాదు. మనిషిలో ఉండే దురాశను ఆసరాగా చేసుకుని జరిగే ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది మనమే. కాస్త ఓపిక పట్టి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే.. ఇందులో మేజిక్కూ లాజిక్కూ రెండూ అర్థమౌతాయి. సోషల్ మీడియా ఇంజనీరింగ్‌పై గ్రిప్పున్న మోసగాళ్లు మన పక్కనే పొంచి ఉంటారు. ఈజీ పనికి డబ్బులొస్తాయని ప్రలోభపెడితే దానివెనుక మోసం దాగిఉంటుందని గ్రహించాలి. అటువంటిదేదైనా మీ నోటీసుకొస్తే రెస్పాండ్ కాకపోవడమే బెటర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..