భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అశ్వారావుపేట మండలం, వడ్డె రంగాపురం గ్రామంలో 20 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. వారిని వెలివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ దేవతలను కొలిచేందుకు గానూ, అడిగిన చందా ఇవ్వలేదనే కారణంగా కుల పెద్దలను వారిపై బహిష్కరణ వేటు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వడ్డె రంగాపురంలో సుమారు 120 వడ్డెర కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా ఒకే వడ్డెర కులానికి చెందినవారు. అయితే, వడ్డె రంగాపురం గ్రామానికి చెందిన గుంజి లక్ష్మయ్య, డేరంగుల దుర్గయ్య, పల్లపు అప్పారావు తదితరులు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టించాలని తీర్మానించారు. ఇందుకు గానూ ఆగ్రామంలోని 120 కుటుంబాల వారు ఒక్కో కుటుంబానికి రూ.3000 చెల్లించాలని ఆదేశించారు. అదే గ్రామంలోని 20కుటుంబాలకు చెందిన వారంతా ఇందుకు ఒప్పుకోలేదు. తామంతా క్రైస్తవ మతం స్వీకరించామని, అందువల్ల తాము చందా ఇవ్వలేమని చెప్పారు. అలా చేస్తే తమ విశ్వాశానికి వ్యతిరేకమని తేల్చి చెప్పారు. అంతేకాదు. ఇటువంటి గ్రామ దేవతల పూజలు వంటి వాటికి తామంతా వ్యతిరేకమని చెప్పారు.
దీంతో ఆగ్రహించిన గ్రామపెద్దలు ఆ 20 కుటుంబాల వారిని పిలిపించారు. కులానికి కట్టుబడకుండా, పెద్దలకు ఎదురు సమాధానం చెప్పారని ఆగ్రహించారు. అందుకు గాను తమను కులం నుండి వెలి వేస్తున్నట్టుగా తీర్పునిచ్చారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేసారు. తమ బంధువులు తమ ఇంటికి వచ్చినా, తాము వారి ఇళ్ళకు వెళ్లినా, మా బంధువులు మాతో మాట్లాడినా రూ.5000 జరిమానా విధించనున్నట్టుగా ప్రకటించారు. అంతే కాకుండా తమకు కిరాణా, కూరగాయలు అమ్మినా రూ.5000 జరిమానా కట్టాలని కుల పెద్దలు తీర్మానం చేసారని వాపోయారు. చర్చిలో ప్రార్థనలు కూడా చేయడానికి వీళ్లేదని హెచ్చరించారంటూ బాధితులు ఆరోపించారు. దీంతో తామంతా చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇన్ని రోజులు భరించామని, ఇక ఈ విషయాన్ని పోలీసులు, అధికారుల దృష్ఠికి తీసుకువెళ్తామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను పరిష్కరించాలని బాధిత 20 కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..