AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భారతీయ శిల్పకళకు అంతరిక్ష గౌరవం.. సూది రంధ్రంలో ముగ్గురు మహనీయులు!

శనివారం విక్రమ్-1 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విషయం అందరికి తెలిసిందే.. కానీ ఈ ప్రయోగంలో అత్యంత ఆసక్తికరమైన అంశం మరోకటి ఉంది.. ఈ రాకెట్‌తో పాటు ఒక సూది కూడా అంతరిక్షంలోకి వెళ్లింది! అంతకూ ఆసూదిని ఎందుకు స్పేస్‌లోకి పంపారు. అందులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: భారతీయ శిల్పకళకు అంతరిక్ష గౌరవం.. సూది రంధ్రంలో ముగ్గురు మహనీయులు!
Warangal Micro Artist Ajay Kumar
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 19, 2026 | 12:24 PM

Share

మిషన్ ఆగమన్ పేరిట పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుండి విక్రమ్-1 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, ఈ రాకెట్ ప్రయోగంలో మరొక అద్భుతం జరిగింది. రాకెట్‌తో పాటు ఒక సూదిని కూడా అంతరిక్షంలోకి పంపారు శాస్త్రవేత్తలు. వరంగల్‌కు చెందిన అంతర్జాతీయ అతిసూక్ష్మ కళాకారుడు అజయ్ కుమార్ సూది బెజ్జంలో రూపొందించిన సూక్ష్మ కళాఖండాలు ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి చేరుకున్నాయి. సూది రంధ్రంలో ముగ్గురు మహనీయుల సూక్ష్మ శిల్పాలను పంపడం అత్యంత అరుదైన విశేషం.

హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో విక్రమ్-1ను రూపొందించి, విజయవంతంగా నింగిలోకి పంపింది. ఒక ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ రాకెట్‌తో పాటు అతిసూక్ష్మ కళాఖండాలు కూడా అంతరిక్షంలోకి చేరడం మరో మైలురాయి. వరంగల్‌కు చెందిన అజయ్ కుమార్‌కు ఈ ఘనత దక్కడంతో, భారతీయ సూక్ష్మ శిల్పకళ అంతరిక్ష చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా నిలిచింది.

వరంగల్‌లోని మట్టెవాడ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్, సూది రంధ్రంలో భారతదేశపు మహనీయ శాస్త్రవేత్తలు డా. సి.వి.రామన్, డా. విక్రమ్ సారాభాయి, భారతరత్న డా. ఏ.పి.జె.అబ్దుల్ కలాంల ప్రతిరూపాలను చెక్కారు. ఈ శిల్పాలు సూది బెజ్జంలో కేవలం 800 మైక్రాన్ల (0.8 మిల్లీమీటర్లు) ఎత్తుతో అత్యంత సూక్ష్మంగా రూపొందించబడ్డాయి. వీటిని సాధారణ మానవ కంటితో స్పష్టంగా చూడటం సాధ్యం కాదు; ప్రత్యేక మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే వీక్షించవచ్చు.

ఈ సూక్ష్మ కళాఖండాలను రూపొందించడానికి సుమారు 140 గంటల సమయం పట్టిందని అజయ్ చెప్పారు. అంతరిక్ష ప్రయాణానికి అనువుగా ఉండేలా స్టెయిన్‌లెస్ స్టీల్, 24 క్యారెట్ల బంగారం, స్వచ్ఛమైన వెండి, సిరామిక్ పొడి, కార్బన్ ఫైబర్ చూర వంటి ప్రత్యేక పదార్థాలను ఉపయోగించి వీటిని తయారు చేసినట్లు ఆయన వివరించారు. అత్యంత సూక్ష్మస్థాయిలో అపారమైన ఓర్పు, ఏకాగ్రత, ఖచ్చితత్వంతో ఈ కళాఖండాలను పూర్తి చేయడం పెద్ద సవాలుగా నిలిచిందన్నారు.

Skyroot Aerospace ఇంజినీరింగ్ బృందం సూచించిన సాంకేతిక ప్రమాణాల ప్రకారం ఈ కళాఖండాలను రూపొందించారు. వీటికి కఠినమైన వైబ్రేషన్, హీటింగ్, ఇతర ఇంజినీరింగ్ అర్హత పరీక్షలు నిర్వహించగా, ఇవి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాయి. అనంతరం వీటిని ప్రత్యేకంగా రూపొందించిన రక్షిత పేలోడ్ హౌసింగ్‌లో అమర్చి, Vikram-1 రాకెట్ పేలోడ్‌లో భాగంగా అంతరిక్ష యాత్రకు పంపారు.

ప్రపంచ చరిత్రలో అంతరిక్షంలోకి పంపబడిన కళాఖండాలలో ‘మూన్ మ్యూజియం’ (1969), ‘ఫాలెన్ ఆస్ట్రోనాట్’ (1971) వంటివి విశేష గుర్తింపు పొందాయి. ఇప్పుడు భారతదేశం నుంచి సూది రంధ్రంలో రూపొందించిన ఈ సూక్ష్మశిల్పాలు అంతరిక్షంలోకి ప్రయాణించాయి. దీంతో ప్రపంచ అంతరిక్ష కళా చరిత్రలో భారతీయ సూక్ష్మ శిల్పకళకు ఒక ప్రత్యేక స్థానం లభించనుంది.

గత 40 సంవత్సరాలుగా తాను నిర్విరామంగా, అంకితభావంతో కొనసాగిస్తున్న సూక్ష్మ శిల్పకళకు దక్కిన అత్యున్నత గౌరవంగా దీన్ని భావిస్తున్నానని అజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. తన చేతులతో రూపొందించిన కళాఖండాలు ప్రపంచ అంతరిక్ష అన్వేషణ చరిత్రలో భాగం కావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని, గర్వాన్ని, సంతృప్తిని కలిగించిందని అన్నారు. తన కళపై విశ్వాసం ఉంచి ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన Skyroot Aerospace సహ వ్యవస్థాపకులు, సీఈఓ పవన్ కుమార్ చందన, నాగ భరత్, నిఖిల్ మద్దూరి, డా. సి.వి.ఎస్. కిరణ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us