ఆఫ్ట్రాల్ వైల్డ్ డాగ్స్ అనుకోకండి.. వాటి ప్లాన్, కమ్యూనికేషన్, హంటింగ్ అన్నీ అద్భుతం
అడవిలో ఒంటరిగా అంత బలంగా కనిపించకపోయినా, గుంపుగా కదిలితే వైల్డ్ డాగ్స్ ఎంత పెద్ద జంతువునైనా కూలదోయగలవు. సమన్వయం, వేగం, ఓర్పు, తెలివైన వ్యూహంతో వేటాడే ఇవి ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వేటగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందాయి. వాటి గురించి పూర్తి వివరాలు ...

అడవిలో సింహం అడవికి రాజు అయితే.. వేటలో అసలైన టీమ్ ప్లేయర్లు మాత్రం వైల్డ్ డాగ్స్. ఒంటరిగా వీటి బలం పెద్దగా కనిపించకపోయినా.. గుంపుగా కదిలితే చిరుతలు, హైనాలు కూడా వీటిని తేలిగ్గా తీసుకోవు. సమన్వయం, వేగం, ఓర్పు, తెలివైన వ్యూహం కలిస్తే ఎంత పెద్ద జంతువునైనా ఎలా కూలదోయవచ్చో వైల్డ్ డాగ్స్ ప్రతి వేటలో నిరూపిస్తుంటాయి.
వేట మొదలయ్యే ముందే ప్లాన్ రెడీ
వైల్డ్ డాగ్స్ ఎప్పుడూ హడావుడిగా దాడి చేయవు. ముందుగా గుంపులోని సభ్యులు చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తారు. మందలో ఉన్న జంతువుల్లో ఏది బలహీనంగా ఉంది.. ఏది గాయపడింది.. ఏది పిల్లది.. లేదా ఏది గర్భిణి అనే విషయాలను గుర్తిస్తాయి. ఆ తర్వాత అదే లక్ష్యంగా చేసుకుని వేట ప్రారంభిస్తాయి.
అలసిపోయే వరకు తరుముతాయి
సింహం లాగా ఒక్క దూకుడుతో వేట ముగించాలనే ప్రయత్నం చేయవు. వైల్డ్ డాగ్స్ ప్రత్యేకత “ఎండ్యూరెన్స్ హంటింగ్”. అంటే వేట జంతువును కిలోమీటర్ల కొద్దీ తరుముతూ అలసిపోయేలా చేస్తాయి. గంటకు 60 కిలోమీటర్ల వరకు వేగంతో పరిగెత్తగలిగినా.. ముఖ్యంగా ఎక్కువసేపు అదే వేగాన్ని కొనసాగించగల సామర్థ్యం వీటికి ఉంటుంది. చివరకు వేట జంతువు పూర్తిగా శక్తి కోల్పోయినప్పుడు గుంపంతా ఒకేసారి దాడి చేస్తుంది.
ప్రతి సభ్యుడికి ఒక బాధ్యత
వైల్డ్ డాగ్స్ గుంపులో ప్రతి ఒక్కరికీ ఒక పాత్ర ఉంటుంది. కొందరు ముందుకు వెళ్లి దారి అడ్డుకుంటారు. మరికొందరు వెనుక నుంచి తరుముతారు. ఇంకొందరు పక్కల నుంచి చుట్టుముట్టి తప్పించుకునే మార్గాలను మూసేస్తారు. ఈ సమన్వయంతో జింకలు, అడవి పందులు, దుప్పులు, కొన్ని ప్రాంతాల్లో చిన్న గేదెలను కూడా వేటాడగలుగుతాయి.
90 శాతం వరకు విజయవంతమైన వేట
సింహాలు చేసే వేటల్లో విజయం సాధారణంగా 20 నుంచి 30 శాతం మాత్రమే ఉంటుంది. చిరుతల విజయం కూడా అంతకంటే ఎక్కువ కాదు. కానీ వైల్డ్ డాగ్స్ గుంపుగా చేసే వేటల్లో విజయశాతం 70 నుంచి 90 శాతం వరకు నమోదవుతుందని వన్యప్రాణి పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వేటగాళ్లలో వీటిని ఒకటిగా పరిగణిస్తారు.
అద్భుతమైన కమ్యూనికేషన్
వైల్డ్ డాగ్స్ మొరగడం కంటే ప్రత్యేకమైన శబ్దాలు, కూతలు, శరీర కదలికలతో ఒకదానికొకటి సంకేతాలు ఇస్తాయి. వేట సమయంలో ఎప్పుడు వేగం పెంచాలి.. ఎప్పుడు దిశ మార్చాలి.. ఏ జంతువును లక్ష్యంగా చేసుకోవాలి అనే సమాచారాన్ని క్షణాల్లో పంచుకుంటాయి. ఈ కమ్యూనికేషన్ వల్లే వాటి దాడులు చాలా కచ్చితంగా ఉంటాయి.
కుటుంబ బంధాలకు పెద్దపీట
వేట పూర్తయ్యాక ముందుగా పిల్లలకు ఆహారం తినే అవకాశం ఇస్తాయి. తర్వాత పాలిచ్చే ఆడ కుక్కలు, చివరగా మిగతా సభ్యులు తింటారు. వేటకు వెళ్లలేని పిల్లలు లేదా గాయపడిన సభ్యుల కోసం ఆహారాన్ని కడుపులో నిల్వచేసుకుని వచ్చి మళ్లీ బయటకు కక్కి తినిపించడం కూడా వీటి ప్రత్యేక లక్షణం. జంతు ప్రపంచంలో ఇలాంటి సహకార స్వభావం చాలా అరుదు.
సింహాలకే సవాల్
వైల్డ్ డాగ్స్ సింహాలతో నేరుగా పోరాటానికి దిగవు. కానీ పెద్ద గుంపుగా ఉంటే సింహాలను కూడా ఇబ్బంది పెట్టగలవు. మరోవైపు సింహాలు, హైనాలు అవకాశం దొరికితే వైల్డ్ డాగ్స్ వేటను దోచుకుంటాయి. అయినప్పటికీ వీటి సమన్వయం కారణంగా అనేకసార్లు తమ ఆహారాన్ని కాపాడుకోగలుగుతాయి.
అంతరించిపోతున్న జాతి
అద్భుతమైన వేటగాళ్లు అయినప్పటికీ వైల్డ్ డాగ్స్ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గుతోంది. అడవులు తగ్గిపోవడం, మానవ-వన్యప్రాణుల ఘర్షణలు, అంటువ్యాధులు, రోడ్డు ప్రమాదాలు వంటి కారణాలతో ఇవి ప్రమాదంలో ఉన్నాయి. అందుకే అనేక దేశాల్లో వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
అడవిలో బలం ఒక్కటే విజయాన్ని నిర్ణయించదు. సరైన వ్యూహం, అద్భుతమైన సమన్వయం, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఎంత పెద్ద ప్రత్యర్థినైనా ఎదుర్కోవచ్చని వైల్డ్ డాగ్స్ నిరూపిస్తున్నాయి. అందుకే ప్రకృతిలో టీమ్‌వర్క్‌కు బ్రాండ్ అంబాసిడర్లు అని వీటిని పిలిచినా అతిశయోక్తి కాదు.
