
సింగరేణి సంస్థలో మోగిన ఎన్నికల నగారా.. ప్రధాన రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ అనూహ్యంగా వచ్చి పడిన ఈ ఎన్నికలను ఎదుర్కోవడం ప్రతి పార్టీకి పెను సవాల్ గా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగరేణి ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించనున్నాయి. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే నెలలోనే జరుగనున్న సింగరేణి ఎన్నికలు, అన్ని పార్టీలకు రెఫరెండంగా మారనున్నాయి. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలను, సింగరేణిలో గెలిపించుకుంటేనే శాసనసభ ఎన్నికల్లో పాజిటివ్ వాతావరణం నెలకొంటుందని పార్టీలు అంచనాలు వేస్తున్నాయి. ఇందుకోసం వివిధ పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగి కోల్బెల్ట్ ప్రాంతంలో తమ యూనియన్ల గెలుపు కోసం విస్తృత ప్రచారాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ ఎన్నికలు.. ప్రత్యక్షంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావాన్ని చూపనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి, పదునైన వ్యూహాలను అమలుపరిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా సింగరేణి సంస్థలో జరగనున్న ఎన్నికలతో కోల్బెల్ట్ ప్రాంతం మినీ రాజకీయ రణ రంగానికి వేదికగా మారనుంది. అయితే, న్యాయస్థానం తీర్పు మేరకు కేంద్ర కార్మిక శాఖ సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, ఎన్నికల నిర్వహణపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. సంస్థకు చెందిన మొత్తం 15 కార్మిక సంఘాలలో కేవలం రెండు సంఘాలు మాత్రమే ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయి. మిగతా సంఘాలన్నీ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మార్పు పేరిట ఎన్నికల వాయిదా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మెజార్టీ కార్మిక సంఘాల అభిప్రాయం మేరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా హైకోర్టు తీర్పునకు అనుగుణంగా, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇక అక్టోబర్ 28వ తేదీన సింగరేణి ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే ఫలితాలు కూడా అదే రోజు ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు కనీవినీ ఎరుగని రీతిలో సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బోనస్ ప్రకటించారు. వాస్తవానికి హైకోర్టు తీర్పు వల్లే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అనివార్యంగా మారిన పరిస్థితి నెలకొంది. అయితే మరో రెండు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికల వాయిదా వేయాలని యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అక్టోబర్ లోపు ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలని తేల్చీ చెప్పేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయిపోయింది. ఇక అక్టోబర్ 28న ఎన్నికలకు త్వరలోనే ఏర్పాట్లు జరగనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..