Special Trains: సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.. పండగ నేపథ్యంలో ఆ రూట్‌లలో స్పెషల్ ట్రైన్స్!
సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీని నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గాల్లో జనవరి 9, 10, 18 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ 8 రైళ్లు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాయి, పండుగ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

సంక్రాంతి పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్- విజయవాడతో పాటు ఇతర మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 18వ తేదీలలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తాజాగా ప్రకనలో పేర్కొంది. పండుగ సమయంలో ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం ఉందని.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది.
ప్రత్యేక రైళ్లు నడిచే మార్గాలు
హైదరాబాద్- విజయవాడ స్పెషల్ ట్రైన్
రైల్వే శాఖ ప్రకటన ప్రకారం: హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ రూట్‌లలో మొత్తం 8 స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు రైల్వేశాఖ పేర్కొంది. హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 07471 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 10 తేదీల్లో ఉదయం 6 :10 నిమిషాలకు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1:40 నిమిషాలకు విజయవాడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
విజయవాడ- హైదరాబాద్ స్పెషల్ ట్రైన్
అలాగే విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే (07472) నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 18 తేదీల్లో మధ్యాహ్నం 2.40 నిమిషాలకు విజయవాడ నుంచి బయల్దేరి రాత్రి 10: 35 నిమిషాలకు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్-విజయవాడ మధ్య నడిచే ఈ రెండు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, ఘన్‌పూర్, ఖాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్ల మీదుగా రాకపోకాలు సాగిస్తాయి.
హైదరాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ స్పెషల్ ట్రైన్
ఇక హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రాకపోకలు సాగించే 07469 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 10వ తేదీలలో ఉదయం 7:55 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2:15కు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటుంది. అలాగే సిర్పూర్ కాగజ్ నగర్ – హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 07470 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 18 వ తేదీలలో మధ్యాహ్నం 3:15 నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బయల్దేరి రాత్రి 10:20 నిమిషాలకు హైదరాబాద్ డెక్కన్ రైల్వేస్టేషన్‌కు రీచ్ అవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
