Telangana: ఒంటరి మహిళకు అండగా విద్యార్థులు.. స్వయంగా ఇంటిని నిర్మించిన స్టూడెంట్స్‌పై ప్రశంసలు..
టీవీ 9 ప్రసారం చేసిన కథనానికి లభించిన అపూర్వ స్పందన ఓ ఇల్లు నిర్మాణం. పిల్లల సేవాగుణంపై టీవీ9 ప్రసారాలు గ్రామస్తులను కదిలించాయి. రామవరం కాస్తా.. మానవతా వరంగా మారింది. ఆ విద్యార్ధులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
చినుకు చినుకు కలిస్తే గాలి వానగా మారుతుంది.. చేయి చేయి కలిస్తే.. ఎంతటి కష్టమైన పనిని అయినా సులభంగా సాధించవచ్చు. పిల్లలు దేవుడి సమానం.. అన్న మాటకు సజీవ సాక్ష్యంగా అనేక సంఘటనలు నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా టీవీ 9 ప్రసారం చేసిన కథనానికి లభించిన అపూర్వ స్పందన ఓ ఇల్లు నిర్మాణం. పిల్లల సేవాగుణంపై టీవీ9 ప్రసారాలు గ్రామస్తులను కదిలించాయి. రామవరం కాస్తా.. మానవతా వరంగా మారింది. ఆ విద్యార్ధులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
జనగాం జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో.. సలీమా అనే ఒంటరి మహిళకు మోడల్ స్కూల్ యువకులు ఇంటిని కట్టించారు. ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యుల మానవతా కోణంపై టీవీ9 కథనాలు ప్రసారం చేసింది. ఇది తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ మహిళకు సాయం చేస్తున్నారు. అంతే కాకుండా.. వారి వారి గ్రామాల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
Tv9 కథనాల తర్వాత రామవరం కాస్తా మానవతా వరంగా మారింది. పలువురు ఆధికారులు కూడా ఆ మహిళకు సాయం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ మోటార్ సైకిల్ ఇన్‌స్పెక్టర్ గంట రవీందర్ చేతుల మీదుగా ఆ ఇంటిని ప్రారంభించారు. ఒంటరి మహిళ సలిమను గృహప్రవేశం చేయించి.. 15000 వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు.
రాత్రి పగలు తేడా లేకుండా 12 రోజులు శ్రమించి ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. లక్ష రూపాయలతో ఇంటి నిర్మాణం పూర్తి చేసి చిన్న వయసులోనే బిల్డర్స్‌గా మారారు కొడకండ్ల మోడల్ స్కూల్ పిల్లలు. ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్‌తో ఓ తల్లి కన్నీటిని తుడిచి శభాష్ అనిపించుకున్నారు. కూలీలు, మేస్త్రీలు, ఇంజినీర్ల అవతారమెత్తి ఇంటిని నిర్మించిన విద్యార్థులు ప్రశంసలు అందుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..