వైభవంగా సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు.. 108 దివ్యక్షేత్రాల ఆధ్మాత్మిక ఝురి
సమతాకుంభ్ ఉత్సవాల్లో అద్భుత ఘట్టం రథోత్సవం. అష్టాక్షరి మంత్రం, రామనామస్మరణల మధ్య సాకేత రామయ్య.. రథోత్సవం కనులపండువగా సాగింది. రథాన్ని వాహనంగా చేసుకుని వేంచేసిన సాకేతరాముడ్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తర్వాత భగవంతుడికి పవిత్ర మంత్రోచ్ఛారణలతో పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.

108 దివ్యక్షేత్రాల ఆధ్మాత్మిక ఝురి.. విశ్వ విశిష్ట రామానుజ నగరి.. ఎంత కమనీయం..ఎంత రమణీయం.. రథంపై సాకేత రామయ్యను దర్శించే భక్తుల ఆనందం ఆకాశమే హద్దుగా సాగింది. ఇలాంటి రథోత్సవాన్ని దర్శించడం అంటే జన్మధన్యమే అంటారు. యాగశాల నుంచి సమతా స్ఫూర్తి కేంద్రం మీదుగా విరజా సరస్సు వరకు రథోత్సవం కొనసాగింది. ఈ రథంలో ఓ విశేషం ఉంది. శ్రీరంగంలో ఉండే ప్రణవాకార విమానంలా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఉన్న రథానికి కూడా ప్రణవాకార విమాన గోపురం ఉంది. చుట్టూరా దేవతామూర్తులు, ఆళ్వార్లు, ఆచార్యులు, చతుర్ముఖ బ్రహ్మ, అనేక రకముల శిల్పకళా సౌందర్యానికి కాణాచిలా ఉండటం ఈ రథం ప్రత్యేకత.
భగవంతుడు రథమునే తన వాహనంగా చేసుకుని వేంచేస్తాడు. రథంలో వేంచేసిన ఆ భగవంతుడిని దర్శిస్తే పవిత్రులమవుతారని నమ్మకం. ఆ తత్త్వాన్ని భావిస్తూ రథారూఢుడైన భగవంతుడిని దర్శిస్తే కర్మబంధముల నుండి విముక్తులవుతామని శాస్త్రాలు చెబుతున్నాయి. ముందుగా రథములో శ్రీరామచంద్ర ప్రభువు వేంచేశారు. తర్వాత 108 దివ్యదేశ శ్రీమూర్తులలో మొదటి దివ్య దేశ పెరుమాళ్ళు శ్రీరంగనాథుడు, అంతిమ దివ్యదేశ పెరుమాళ్ళు శ్రీ వైకుంఠనాథుడు వేంచేశారు. శాస్త్ర నియమానుసారంగా మొదటి, చివరి వారిని ఏకత్ర చేరిస్తే, మధ్యలోని అందరూ పెరుమాళ్ళు కూడా చేరుతారట. వ్యాకరణ శాస్త్రానుసారం “ఆదిరంతేన సహేతా” ఆది అంతములను కలుపుట.
శ్రీసుదర్శన భగవానుడు కూడా రథంలోకి వేంచేశారు. గరుడ భగవానుడు, బ్రహ్మతో పాటు విశ్వకర్మ ముందు ఉండటం విశేషం. భగవంతుడు రథంలోకి ప్రవేశించగానే దేవతలకి సాత్విక బలిహరణ జరిగింది. తర్వాత గోవింద నామాలు, సంకీర్తనలు, భాజా భజంత్రీలతో కోలాట నృత్యాలతో భక్తులు వెంటరాగా త్రిదండి చినజీయర్ స్వామివారు రథయాత్రను ప్రారంభించారు. రథము యాగశాలకు చేరుకున్నాక పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. శ్రీరంగం క్షేత్రాన్ని తలపించేలా అష్టాక్షరి మంత్రం, రామనామస్మరణల మధ్య సాకేత రామయ్య.. రథోత్సవం కొనసాగింది. యాగశాల నుంచి సమతా స్ఫూర్తి కేంద్రం మీదుగా విరజా సరస్సు వరకు రథోత్సవం సాగింది.
రథోత్సవం ఓ ఎత్తు అయితే చక్రస్నానం మరో అద్బుత దృశ్యం. రథారూఢుడైన భగవంతుడు చక్రస్నానం కోసం విరజాపుష్కరిణికి చేరుకున్నారు. పెరుమాళ్లను మండపంపై వేంచేపు చేసి స్వామిని పెరుగు, తేనె, పండ్ల రసాలతో అభిషేకించారు. భక్తుల కోసం దివి నుంచి భగవంతుడు భువికి దిగి వచ్చాడా అన్నట్టుగా కన్నులపండువను తలపించింది ఈ ఉత్సవం. సమతా మూర్తి కేంద్రం పుష్కరణిలో సాకేత రామచంద్ర ప్రభువుకు చక్రస్నానం నిర్వహించారు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. రామనుజ అనుగ్రహం అందరిపై ఉండేలా ప్రార్ధించారు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. తర్వాత ఆ ప్రార్థన తీర్థాన్ని భగవత్ సేవలో వినియోగించారు. శ్రీరంగంలో ఉన్న సరస్సే ఈ విరజా సరస్సు. శ్రీరంగనాథుడు, శ్రీవైకుంఠనాథుడు, శ్రీరామచంద్రప్రభువు, సుదర్శన భగవానుని పుష్కరణిలో స్నానమాడి, ఆ జలాలను పవిత్రం చేయమని ఆజ్ఞాపించగా, సుదర్శన భగవానుని అర్చక స్వాములు పవిత్ర మంత్రోచ్చారణలతో పుష్కరణిలో స్నానం ఆడించారు.
భగవంతుడికి విరజా పుష్కరిణి జలాలతో అభిషేకం జరిగింది. తర్వాత శ్రీశ్రీశ్రీ త్రిదండ్రి చినజీయర్ స్వామి సహా భక్తులంతా అవభృథ స్నానం ఆచరించారు. ఈ పవిత్ర కార్యక్రమం అయ్యాక పెరుమాళ్లు తమ తమ స్థానాలకు వేంచేశారు. వైకుంఠ పుష్కరిణి అష్టగుణ ఆవిష్కరణ కలిగిన పుష్కరణిలో స్నానమాడితే మళ్లీ జన్మ ఉండదంటారు. అలాంటి అదృష్టాన్ని అందరికీ కల్పించింది సమతాస్ఫూర్తి కేంద్రం.
