
ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్ కేసులో కవిత ఈడీ కస్టడీపై కీలక ఆదేశాలను వెల్లడించింది ఢిల్లీ స్పెషల్ కోర్టు. మరో మూడు రోజులు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈడీ అధికారులు మరో మూడు రోజులు విచారణ జరపాలని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. మార్చి 15న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. కోర్టు వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ మరోసారి కవితను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి బవేజ ఎదుట హాజరు హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత తరపున విక్రమ్ చౌదరి, రమేష్ గుప్తా వాదనలు వినిపించారు. ఈడీ తరపున న్యాయవాది జోహెబ్ హోస్సేన్ ప్రతివాదనలు వినిపించారు. కేజ్రీవాల్‌తో కలిపి కవితను ప్రశ్నించాలని ఈడీ యోచిస్తోంది. ఇందులో భాగంగా మరో 5 రోజుల కస్టడీ కోరింది ఈడీ. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు కవిత చెప్పడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత ఫోన్‌లో డేటాను విశ్లేషించామని న్యాయ మూర్తికి తెలిపారు దర్యాప్తు అధికారులు. అయితే మొబైల్ డేటాలో కొంత భాగాన్ని డిలీట్ చేసినట్లు గుర్తించామన్నారు.
కవిత మేనల్లుడి వ్యాపార వివరాలు కోరితే.. తనకు తెలియదని కవిత సమాధానమిచ్చినట్లు ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కవిత మేనల్లుడు సమీర్ మహేంద్రుతో కలిపి ప్రశ్నించాల్సి ఉందని అందుకే కస్టడీ గడువు పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరారు ఈడీ తరఫు న్యాయవాదులు. పైగా కవిత మేనల్లుడు విచారణకు రావాలని ఆదేశిస్తే హాజరుకాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే కోర్టు ప్రాంగణంలో ఈడీపై కవిత విమర్శలు గుప్పించారు. ఏడాది కిందట అడిగిన విషయాలనే మళ్లీ అడుగుతున్నారని వెల్లడించారు. ఇందులో కొత్త విషయమేదీ లేదని తెలిపారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు, అక్రమంగా అరెస్ట్ చేశారని ఈడీ తీరును విమర్శించారు. అరెస్ట్‌పై న్యాయపోరాటం చేస్తానన్నారు కవిత. అలాగే తన మెడికల్ రిపోర్ట్స్ ఈడీ అధికారులను అడిగితే ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు కవిత. అందుకే వైద్య పరీక్షల రిపోర్ట్స్ తనకు ఇవ్వాలని కోరుతూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రస్తుతం హైబీపీ ఉందని పిటిషన్‌లో పొందుపరిచిన ఆమె తరఫు లాయర్లు వివరించారు. వీటన్నింటినీ జాగ్రత్తగా విన్న న్యాయమూర్తి కావేరి బవేజ మూడు రోజుల కస్టడీ తరువతా మార్చి 26న ఉదయం 11.00 గంటలకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..