Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ.. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, పెండింగ్ నిధులకు సంబంధించిన విషయాలపై డిస్కస్ చేసేందుకు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మరి ఎవరితో ఏయే అంశాలపై చర్చించారో తెలుసుకుందాం..చ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణకు వరద నష్టం సాయం పెంచాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో వరదలు సృష్టించిన విధ్వంసాన్ని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పలు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్ల సహాయం ప్రకటించగా.. తెలంగాణ మాత్రం 416.80 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో వరదలతో తెలంగాణలో జరిగిన నష్టాన్ని అమిత్ షాకు వివరించి మరిన్ని నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. అలాగే విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ భేటీలో మూసీ ప్రక్షాళన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కేంద్రం చేపడుతున్న నమామి గంగే ప్రాజెక్టు తరహాలో మూసీ ప్రక్షాళన కార్యాచరణకు కూడా నిధులు అందించాలని రేవంత్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాను కోరినట్టు తెలుస్తోంది.
అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కూడా భేటీ అయిన రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించాలని కేంద్రమంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థనే ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని సీఎం వివరించారు. హైదరాబాద్ సమీప పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదని కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..