Telangana: డెత్ స్పాట్లుగా మారుతున్న సాగునీటి ప్రాజెక్టులు…
సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టులు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. వీకెండ్స్‌లో అక్కడికు వెళ్లి నీటిలో దిగి, ప్రమాదవశాత్తూ కొంతమంది చనిపోతున్నారు. సెల్ఫీ పిచ్చి మరికొందరి ప్రాణాలు తీస్తోంది, ఇంకొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి బడా రిజర్వాయర్ల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

సిద్దిపేట జిల్లాలో నాలుగేళ్ల కిందట ప్రారంభించిన రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో తరచూ ఎదో ఒక ప్రమాదం జరుగుతోంది. ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు 50 మందికి పైగా మృతి చెందారు. కొందరి విహార యాత్రలు, విషాద యాత్రలుగా ముగిస్తే, మరికొందరు పలు రకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీకెండ్‌లో ఇక్కడకు టూరిస్టులు ఎక్కువగా వస్తున్నప్పుడే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగా సిద్దిపేట శివార్లలోని చంద్లాపూర్ దగ్గర 3 టీఎంసీల సామర్థ్యంతో రంగనాయక సాగర్, మర్కుక్ మండల కేంద్రానికి సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నిర్మించారు. ఇవి హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడంతో పాటు, రాజీవ్ రహదారికి సమీపాన ఉండడంతో వీటిని జనం ఎక్కువగా సందర్శిస్తున్నారు. రెండు నెలల క్రితం కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో హైదరాబాద్ కి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందారు. వాళ్లు హైదరాబాద్ నుంచి బైక్స్‌పై వచ్చి ఇక్కడ గేట్ వేసి ఉండడంతో, రిజర్వాయర్ కట్టను దాటి నీళ్లున్న ప్రాంతానికి వెళ్లి మృత్యువాత పడ్డారు. రిజర్వాయర్ ప్రధాన మార్గంలో గేట్లను పెట్టినా, టూరిస్టులు వేరే మార్గాల గుండా వెళ్లి నీట మునిగిపోతున్నప్పుడు, వాళ్లను కాపాడే పరిస్థితి లేకుండా పోతోంది.
ఇక రంగనాయక సాగర్ దగ్గర పరిస్థితి మరోలా ఉంది. రంగనాయక గుట్ట వెనుక వైపు ప్రాంతంలో నుంచి కొందరు నీటిలోకి దిగుతున్నారు. సెల్ఫీల పిచ్చితో కొందరు నీళ్లలోకి దిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొందరికి ఇది సూసైడ్ స్పాట్‌గా మారిపోయింది. ఈ రిజర్వాయర్లలో ఎప్పుడూ నీళ్లు ఉండడంతో పాటు, లోపల పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఆ విషయం తెలియక నీళ్లలో దిగినవాళ్లు మునిగిపోతున్నారు. వాళ్లను కాపాడడానికి వెళ్లినవాళ్లు కూడా మృత్యువాత పడుతున్నారు.
ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వాయర్ల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు. అలాగే గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచితే, ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయంటున్నారు స్థానికులు.