Video: 6,6,6,6,6,6.. విధ్వంసానికి విశ్వరూపం భయ్యో.. వీడియో చూస్తే గజ్జుమనాల్సిందే..
Dewald Brevis-Sherfane Rutherford: దక్షిణాఫ్రికా SA20 టీ20 లీగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ విధ్వంసం సృష్టించారు. ఈ ఇద్దరు బ్యాటర్స్ ధాటికి బంతిని 11 సార్లు బౌండరీ అవతలి నుంచి వెతికి తీసుకురావాల్సి వచ్చింది. వీరి ఇన్నింగ్స్‌లో మొత్తం 11 బౌండరీలు ఉండగా, అందులో ఏకంగా 10 సిక్సర్లు ఉండటం విశేషం.

Dewald Brevis-Sherfane Rutherford: క్రికెట్‌లో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూడాలంటే.. 2025 చివరి రోజున జరిగిన సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ మ్యాచ్ చూడాల్సిందే. ప్రిటోరియా క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ మధ్య జరిగిన ఈ పోరులో డెవాల్డ్ బ్రెవిస్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ తమ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. చివరి ఓవర్లలో వీరిద్దరూ ఆడిన తీరు ప్రిటోరియా క్యాపిటల్స్ విజయాన్ని ఖాయం చేసింది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
11 సార్లు బౌండరీ అవతలికి వెళ్లిన బంతి..!
బ్రెవిస్ మరియు రూథర్‌ఫర్డ్ ఆడిన ఇన్నింగ్స్‌లు చిన్నవైనా, అవి సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. వీరిద్దరూ కలిసి కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్నారు. కానీ, పరుగుల వరద పారించారు. వీరి ధాటికి బంతిని 11 సార్లు బౌండరీ అవతలి నుంచి వెతికి తీసుకురావాల్సి వచ్చింది. వీరి ఇన్నింగ్స్‌లో మొత్తం 11 బౌండరీలు ఉండగా, అందులో ఏకంగా 10 సిక్సర్లు ఉండటం విశేషం.
వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు..
ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్ ఏమిటంటే.. వీరు బాదిన 10 సిక్సర్లలో 6 సిక్సర్లు వరుస బంతుల్లో వచ్చాయి. ప్రిటోరియా ఇన్నింగ్స్ 18వ ఓవర్ 5వ బంతికి మొదలైన ఈ సిక్సర్ల పరంపర, 19వ ఓవర్ 4వ బంతి వరకు సాగింది.
తొలుత 18వ ఓవర్ వేసిన కార్బిన్ బాష్ వేసిన చివరి రెండు బంతులను బ్రెవిస్ సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత 19వ ఓవర్ వేసిన ప్రిటోరియస్ వేసిన మొదటి 4 బంతులను షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ వరుసగా 4 సిక్సర్లుగా మార్చాడు. వీరిద్దరి మధ్య సిక్సర్లు కొట్టే పోటీ జరుగుతుందా అన్నట్లుగా సాగింది ఈ విధ్వంసం.
28 బంతుల్లో 83 పరుగులు..
View this post on Instagram
డెవాల్డ్ బ్రెవిస్ 276.92 స్ట్రైక్ రేట్‌తో కేవలం 13 బంతుల్లో 36 పరుగులు (4 సిక్సర్లు, 1 ఫోర్) సాధించాడు. మరోవైపు షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ మరింత వేగంగా ఆడుతూ 313.33 స్ట్రైక్ రేట్‌తో కేవలం 15 బంతుల్లోనే 47 పరుగులు (6 సిక్సర్లు) పిండుకున్నాడు. వెరసి, వీరిద్దరూ కలిసి కేవలం 28 బంతుల్లోనే 1 ఫోర్, 10 సిక్సర్లతో మొత్తం 83 పరుగులు జోడించారు.
ప్రిటోరియా క్యాపిటల్స్ ఘన విజయం..
వీరిద్దరి అజేయ ఇన్నింగ్స్‌ల పుణ్యమా అని ప్రిటోరియా క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ముందు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ భారీ ఛేదనలో తడబడిన ముంబై జట్టు కేవలం 135 పరుగులకే పరిమితమై, 85 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.




