Nalgonda District: ఇళ్ల ముందే ఇంటి పెద్దల మృతదేహాలు.. ఆస్తి కోసం అంత్యక్రియలను అడ్డుకున్న బంధువులు..
Nalgonda District News: ఆ వృద్ధుడికి ఇద్దరు భార్యలు, ఆస్తి కూడా 50 ఎకరాల వరకు ఉంది. మొదటి భార్య లింగమ్మకు నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. లింగమ్మ చెల్లెలు నీలమ్మను నరసింహ గౌడ్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు కూడా ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత విభేదాలు రావడంతో రెండో భార్య నీలమ్మ.. నరసింహ గౌడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఇద్దరు భార్యల సంతానం అందరికీ పెళ్లిళ్లు..
నల్గొండ, సెప్టెంబర్ 13: మారుతున్న కాలంతో మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. మనిషి చివరి సంస్కారాలకు కూడా ఆస్తి గోడవలే అడ్డుగోడలుగా మారుతున్నాయి. ఆస్తుల వాటా కోసం.. ఒకరు రిజిస్ట్రేషన్ కావాలని రాస్తారోకో చేయగా మరొకరు పాడేపై పడుకొని అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో చివరి సంస్కారాలకు నోచుకోక ఇంటి పెద్దల మృతదేహాలు.. ఇళ్ల ముందే పడి ఉన్నాయి. ఇలాంటి అమానవీయ ఘటనలకు కారణమైన ఆస్తి గొడవలు ఏంటో తెలుసుకోవాలంటే..
నల్లగొండ మండలం కతాల్‌గూడకు చెందిన పజ్జూరి నర్సింహగౌడ్(80) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ వృద్ధుడికి ఇద్దరు భార్యలు, ఆస్తి కూడా 50 ఎకరాల వరకు ఉంది. మొదటి భార్య లింగమ్మకు నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. లింగమ్మ చెల్లెలు నీలమ్మను నరసింహ గౌడ్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు కూడా ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత విభేదాలు రావడంతో రెండో భార్య నీలమ్మ.. నరసింహ గౌడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఇద్దరు భార్యల సంతానం అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కొద్ది రోజుల క్రితం రెండో భార్య కొడుకు చనిపోవడంతో నీలమ్మ తన కోడలు, మనవడు, మనమరాలతో కలిసి నల్లగొండలో ఉంటోంది.
అనారోగ్యంతో నర్సింహ చనిపోయిన విషయం తెలుసుకున్న నీలమ్మ ఆమె కోడలు, కుమార్తె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కతాల్‌గూడకు వచ్చారు. మొదటి భార్యతో సమానంగా తనకు కూడా పసుపు, కుంకుమ సాంప్రదాయ ప్రక్రియను చేపట్టాలని నీలమ్మ కోరింది. దీన్ని మొదటి భార్య కొడుకులు అడ్డుకోవడంతో.. నర్సింహ గౌడ్ మృతదేహాన్ని కట్టిన పాడెపై నీలమ్మ పడుకుని అంత్యక్రియలను అడ్డుకుంది. తన చనిపోయిన కొడుకు పిల్లల ఆలనా పాలనా కోసం ఆస్తిలో కొంత ఇవ్వాలని పట్టుబట్టింది. దీంతో నరసింహ గౌడ్ అంత్యక్రియలు నిలిచిపోయాయి. దీంతో పెద్దలు, స్థానికులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆస్తి కోసం రాస్తారోకోతో చివరి సంస్కారాలను అడ్డుకున్న బంధువులు..
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులుగూడెం గ్రామానికి చెందిన వెంపటి సత్యనారాయణ(65)కు ఆరుగురు సోదరులు, సోదరి ఉంది. సత్యనారాయణకు 30 ఏళ్ల కిందట మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన భాగ్యమ్మతో వివాహం జరిగింది. ఇల్లరికం వచ్చిన సత్యనారాయణ, భాగ్యమ్మలకు సంతానం కలగలేదు. కొన్నాళ్లకు కుటుంబ తగాదాలతో అనారోగ్యం బారిన పడిన భర్త సత్యనారాయణను. .భార్య భాగ్యమ్మ పట్టించు కోలేదు. దీంతో ఆయన నర్సింహులు గూడెంలోని సోదరుల వద్దకు చేరి అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఇందుకోసం తన పేరిట ఉన్న మూడున్నర ఎకరాల భూమిని సత్యనారాయణ పేరిట రిజిస్ట్రేషన చేసేందుకు భాగ్యమ్మ అంగీకరించింది. ఇందుకోసం స్లాట్‌బుక్ చేయగా ఐదు రోజుల్లో రిజిస్ట్రేషన చేసేందుకు అవకాశం ఉంది.
అయితే మంగళవారం సత్యనారాయణ మృతి చెందాడు. సత్యనారాయణ మృతదేహాన్ని ఆయన సోదరులు సిరికొండలోని భాగ్యమ్మ ఇంటికి తీసుకువచ్చారు. సత్యనారాయణ పేరిట చేస్తానన్న మూడున్నర ఎకరాలతో పాటు మరికొంత భూమిని అదనంగా తమకు రిజిస్ట్రేషన చేయాలని భాగ్యమ్మపై సత్యనారాయణ సోదరులు ఒత్తిడి చేశారు. అప్పటివరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని పట్టుబట్టారు. దీంతో భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు భాగ్యమ్మ, ఆమె ఇద్దరు సోదరులు మోతెలోని మీ సేవా కేంద్రానికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక భాగ్యమ్మ పేరు మీద ఉన్న భూమిలో తమకు కూడా వాటా కావాలని ఆమె అన్నదమ్ములు, వారి కొడుకులు సూర్యాపేట- ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. ఆస్తి విషయం తేలే వరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని భాగ్యమ్మ అత్తింటి వారితో పాటు పుట్టింటి వారు కూడా పట్టుబడుతున్నారు. దీంతో ఆస్తి కోసం ఇరువర్గాలు గొడవ పడడంతో అంత్యక్రియలు నిలిచి పోయాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..