Ramagundam Election Result 2023: రామగుండంలో కాంగ్రెస్ విజయం.. చందర్ పై మక్కాన్ సింగ్ ఠాకూర్ గెలుపు..
Ramagundam Assembly Election Result 2023 Live Counting Updates: రాష్ట్ర రాజకీయాల్లో రామగుండం రూటే సపరేటు. సందర్భం ఏదైనా, ఈ ప్రాంతం ఒక ప్రత్యేకతను చాటుకుంటూ వస్తుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా రామగుండం రాజకీయ రణరంగానికి వేదికగా మారింది. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో నువ్వా.. నేనా.. అనే రీతిలో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకంగా మారాయి.
రాష్ట్ర రాజకీయాల్లో రామగుండం రూటే సపరేటు. సందర్భం ఏదైనా, ఈ ప్రాంతం ఒక ప్రత్యేకతను చాటుకుంటూ వస్తుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా రామగుండం రాజకీయ రణ రంగానికి వేదికగా మారింది. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో (Ramagundam Assembly Election) నువ్వా.. నేనా.. అనే రీతిలో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకంగా మారాయి. రామగుండం నియోజకవర్గంలో 2.21 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నవంబరు 30న జరిగిన పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 68.71 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. రామగుండంలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ గెలుపొందారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే, BRS అభ్యర్థి కోరుకంటి చందర్, కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరికి ధీటుగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయాన్ని చవి చూసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. 2018 ఎన్నికల్లో TRS రెబల్‌గా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ వెంటనే గులాబీ గూటికి చేరి ప్రస్తుత ఎన్నికల్లో BRS అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఎమ్మెల్యేగా రామగుండంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులే తన గెలుపుకు దోహదపడతాయని కోరుకంటి చందర్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజ్ ఠాకూర్, సింపతి వేవ్‌తో విజయం సాధించాలని ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తనకు లాభిస్తుందని రాజ్ ఠాకూర్ ఆశలు పెట్టుకున్నారు. ఇక, సుదీర్ఘకాలంగా BRS లో ఉండి ఎమ్మెల్యే టికెట్ ను సాధించడంలో ఆశాభంగానికి గురైన కందుల సంధ్యారాణి, ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ఉన్న వ్యతిరేకత తనకు లాభించడంతోపాటు ఆడపడుచుగా ఈ ప్రాంత ప్రజలు ఆదరిస్తారన్న ధీమాతో సంధ్యారాణి ఉన్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
ఇక రామగుండం మున్సిపల్ తొలి చైర్మన్ గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సోమారపు సత్యనారాయణ గత ఎన్నికల్లో TRS అభ్యర్థిగా పోటీ చేసి, రెబల్ అభ్యర్థి కోరు కంటి చందర్ చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో తాను సాధించిన అభివృద్ధితోపాటు వయసు రిత్యా ఇవే తనకు చివరి ఎన్నికలు కావడంతో ప్రజలు ఆదరించే అవకాశాలు ఉన్నాయని సోమారపు సత్యనారాయణ బలంగా భావిస్తున్నారు.
పరిశ్రమలకు నిలయమైన రామగుండంలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లే కీలకం.. నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 35 నుండి 40% ఓట్లు సింగరేణి కార్మిక కుటుంబాలవే కావడంతో వారి మద్దతు కోసం అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులైన కోరుకంటి చందర్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కందుల సంధ్యారాణితో పాటు స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కూడా బరిలో నిలవడంతో అక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతోనే బయటపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్