Heavy Rainfall: తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం.. పంట నష్టంతోపాటు ఆస్తి నష్టం..

చేతికొచ్చిన పంట కళ్లెదుటే నేలకొరగడంతో రైతు గుండెలు బాదుకుంటున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీవర్షాలు, వడగండ్లతో రైతు నిండా మునిగాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో భారీ ఆస్తి నష్టం తీవ్ర నష్టం వాటిల్లింది.

Heavy Rainfall: తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం.. పంట నష్టంతోపాటు ఆస్తి నష్టం..
Heavy Rainfall
Follow us

|

Updated on: Mar 19, 2023 | 2:03 PM

తెలంగాణలో కురుస్తున్న వడగండ్లు.. రైతులకు కడగండ్లు మిగిల్చాయి. వందల ఎకరాల్లో మిర్చి, అరటి, వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట కళ్లెదుటే నేలకొరగడంతో రైతు గుండెలు బాదుకుంటున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీవర్షాలు, వడగండ్లతో రైతు నిండా మునిగాడు. మంచిర్యాల జిల్లాలో వందల ఎకరాల్లో మొక్కజొన్న, మిర్చి నేలకొరిగింది. చెన్నూరులో చేతికొచ్చిన మిర్చి తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, మామడ, దస్నాపూర్‌లో భారీవర్షానికి మొక్క జొన్న పంట నేలకొరిగింది. వందల ఎకరాల్లో పంట నేలవాలడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇక జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో భారీ ఆస్తి నష్టం తీవ్ర నష్టం వాటిల్లింది. బలమైన ఈదురు గాలులకు ఇల్లు కూలిన ఘటన మండలంలోని కూడూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో రాత్రి ఈదురు గాలుల‌తో అకాల‌ వ‌ర్షం కురిసింది. దీంతో గ్రామానికి చెందిన కౌడె బిక్షపతి ఇళ్లు కూలిపోయింది. దీంతో ఆ కుటుంబం వీదిన పడింది. త‌న కుటుంబాన్ని ఆదుకోవాల‌ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇల్లు కూలిపోయే సమయంలో బిక్షపతి, లక్ష్మి దంపతులు పక్క గదిలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అస‌లే ఆర్థికంగా వెన‌క‌బ‌డ్డ ఆమె ఫ్యామిలీ, ఇప్పుడు సొంత ఇల్లు కూడా కూలి పోవ‌డంతో రోడ్డున ప‌డ్డారు. అధికారులు స్పందించి త‌క్ష‌ణ‌మే ఆ కుటుంబానికి డ‌బుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని కోరారు గ్రామ‌స్థులు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పెద్దఎత్తున పంట నష్టం

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. వేల ఎకరాల్లో వరి నేలవాలింది. ఈదురుగాలులకు మామిడి నేలరాలింది. నేలావాలిన పంటను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. పంటను నిలబెట్టేందుకు నానాపాట్లు పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు మరో 24గంటలపాటు డేంజర్‌ అలర్ట్‌

తెలుగు స్టేట్స్‌కి ఇంకా ముప్పు పొంచే ఉంది. మరో 24గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. ఉన్నట్టుండి క్యుములోనింబస్‌ మేఘాలు విరుచుకుపడే అవకాశముందని అలర్ట్‌ ఇష్యూ చేసింది. పెనుగాలులు, వడగళ్ల వానతోపాటు పిడుగులు పడేఛాన్స్‌ ఉందంటోంది వెదర్ డిపార్ట్‌మెంట్‌

అకాల వర్షాలపై అలర్టైన ఆంధ్రప్రదేశ్‌

అకాల వర్షాలపై ఏపీ అప్రమత్తమైంది. వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులను అలర్ట్‌ చేశారు సీఎం జగన్‌. ఉన్నట్టుండి విధ్వంసం సృష్టిస్తోన్న రాళ్ల వర్షంపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం