Telangana Video: బొగత జలపాతం ఉదృతరూపం… పర్యాటకుల సందర్శనకు అనుమతి నిరాకరణ
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. తెలంగాణలోని ములుగు, కరీంనగర్, కొమురం భీం జిల్లాల్లో కుంభవృష్టిని తలపించాయి. భారీ వర్షాలతో వరద పోటెత్తి పలు గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా భీకర వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు...

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో పలు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. తెలంగాణలోని ములుగు, కరీంనగర్, కొమురం భీం జిల్లాల్లో కుంభవృష్టిని తలపించాయి. భారీ వర్షాలతో వరద పోటెత్తి పలు గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా భీకర వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాలతో వెంకటాపురం గ్రామంలోని బొగత జలపాతానికి వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో బొగత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదం పొంచి ఉండటంతో జలపాతాల్లోకి ఎవ్వరినీ అనుమతించట్లేదు అధికారులు. మరోవైపు పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
వీడియో చూడండి:
కుండపోత వర్షానికి ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామం మునిగింది. గ్రామ శివారులోని అత్తచెరువు తూము లీక్ అవుతుండడంతో గ్రామంలోకి వరద నీరు భారీగా చేరింది. దాంతో.. మల్లూరు గ్రామంలోని ఇళ్ల మధ్య నుంచి మోకాళ్ళ లోతులో వరద ప్రవహిస్తోంది. ఇళ్ళలోకి నీరు చేరడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దగొల్లగూడెంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా.. మహబూబాబాద్ జిల్లాలో నరేష్ అనే యువకుడు వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయ్యారు.
కోల్ బెల్ట్ ఏరియాలో భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విస్తారమైన వర్షాల కారణంగా రామగుండం రీజియన్లు, మందమరి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియా, భద్రాది కొత్తగూడెం ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో వరద నీరు చేరుకుంది. బొగ్గు ఉత్పత్తులకు అంతరాయం ఏర్పడుతుంది..
కరీంనగర్ పట్టణంలో వర్షం దంచికొట్టింది. గతంలో ఎప్పుడూ చూడని రీతిలో కురిసిన భారీ వర్షంతో కరీంనగర్ రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనాలు గంటల పాటుగా వరదనీటిలోనే నిలిచిపోయాయి. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో కరీంనగర్ ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఇక ఏపీలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీ వర్షం పడింది. మైలవరం సమీపంలోని కొండవాగుకు వరద పోటెత్తడంతో సూరిబాబుపేట, బాలయోగినగర్ ప్రాంతాలకు వెళ్ళే రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని తోటమూల- వినగడప గ్రామాల మధ్య కట్టలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తాత్కాలిక వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దాంతో.. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంపై మరోసారి సముద్రపు అలలు విరుచుకుపడుతున్నాయి. రాకాసి అలలతో మాయాపట్నం గ్రామం జలమయం అయింది. ఇళ్లలోకి, వీధిలోకి దూసుకొచ్చిన సముద్ర నీటితో స్థానికులు అవస్థలు పడుతున్నారు.
