దేవుడి పేరుతో వ్యాపారమా!? ఇది సనాతన ధర్మ స్ఫూర్తికి తూట్లు పొడవటం కాదా!?
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సమయంలో ఒక మాటన్నారు కొందరు. బడి కడితే లాభం కానీ గుడి కడితే ఏమొస్తుందని. ఆ అయోధ్య రాముడు ఐదేళ్లలో 400 కోట్ల రూపాయల పన్ను కట్టాడని వితండం చేసే వాళ్లకి తెలీదు. ఎంతోమందికి శాశ్వత ఉద్యోగాలొచ్చాయి ఆలయం వల్ల. ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి విద్య అందుతోంది. ఆస్పత్రులకు నిధులు వెళ్తున్నాయి అయోధ్యరాముడి నుంచి. భక్తులు ఇచ్చింది తిరిగి సమాజానికి, ప్రభుత్వానికే వెళ్తోంది. మరి... అదే అయోధ్యను సెట్టింగు వేయడం ద్వారా ఏం జరిగింది? పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లుపడింది. ప్రభుత్వానికి ఒక్క రూపాయి వచ్చింది లేదు. భక్తి పేరుతో మోసం, దోపిడీ తప్ప సమాజాన్ని ఉద్దరించే పని ఒక్కటీ చేయలేదు. పైగా అయోధ్య రాముడి పేరుతో లక్షల రూపాయల వ్యాపారం చేశారు. భక్తిని సొమ్ము చేసుకోవడం అంటే అది. దేవుడితో వ్యాపారం చేయడం అంటే అది. సో.. బోత్ ఆర్ నాట్ సేమ్.

సర్వదర్శనం లేని ఆలయమే లేదు మనదేశంలో. పేదవాళ్లు సైతం ఉచితంగా దర్శించుకోవచ్చు. దేవుడిని డబ్బుతో తూకం వేయం అనే వాళ్లకు సైతం సర్వదర్శనం వెసులుబాటు ఉంది. మరి… విశాఖలో ఇదేం దందా. ఆర్‌కే బీచ్ రోడ్‌లోని ఆన్‌మూల్ విల్లాలో మే 22 నుంచి శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా పేరుతో ఎగ్జిబిషన్ మొదలుపెట్టారు. ఈ నెలాఖరు వరకు స్థానికులు సందర్శించేందుకు అనుమతి తీసుకున్నారు. బాలరాముడిని చూసేందుకు అయోధ్య వరకు వెళ్లలేని వారికి ఇదో వరం లాంటిది అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నమూనాను కూడా అచ్చంగా అయోధ్య మందిరాన్ని పోలేలా సెట్టింగ్ వేశారు. ఆ తరువాత మొదలుపెట్టారు అసలు వ్యాపారం. ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ కాగానే చెప్పులు విప్పండి అంటారు. జతకో 5 రూపాయలు. సరే.. ఆలయంలోకి పాదరక్షలతో వెళ్లొద్దు కాబట్టి.. ఆ 5 రూపాయలేదో ఇచ్చేస్తాం మనం. అలా చెప్పులు విప్పి లోపలికి వెళ్లగానే 50 రూపాయల కౌంటర్‌ను అడ్డంగా పెట్టారు. విమర్శలు రాగానే ఇప్పుడు ఉచిత దర్శనం పెట్టారనుకోండి. కాని, ఆ క్షణం వరకు జరిగిందేమిటి? 50 రూపాయల టికెట్ తీసుకుంటేనే దర్శనం. కనీసం దూరం నుంచి చూసే భాగ్యం కూడా కల్పించలేదు. దీన్ని పక్కా వ్యాపారం అనక ఇంకేం అంటారు. చెప్పులు విప్పి లోపలికి వెళ్లిన తరువాత.. విధి లేని పరిస్థితుల్లో 50 రూపాయల టికెట్ తీసుకోవాల్సిందే ఎవరైనా. ఇంత దాకా వచ్చాక చూడకపోతే ఎలా...




