AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Crisis: నిప్పులు కురిపించేందుకు సిద్ధమవుతున్న సూర్యుడు.. తెలంగాణలో పీక్స్‌కు చేరిన పవర్‌ డిమాండ్

వడగాల్పులు వణుకు పుట్టించబోతున్నాయి. ఈ కష్టాలకు తోడు కరెంట్‌ కష్టాలు ఎదుర్కొనేందుకు కూడా జనాలు సిద్ధపడాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో పవర్‌ డిమాండ్‌ పీక్స్‌కు చేరింది.

Power Crisis: నిప్పులు కురిపించేందుకు సిద్ధమవుతున్న సూర్యుడు.. తెలంగాణలో పీక్స్‌కు చేరిన పవర్‌ డిమాండ్
Power Crisis
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 01, 2023 | 9:21 PM

ఒక వైపు మార్చి మొదలవడంతోనే మాడు పగులగొడుతున్న ఎండలు, మరో వైపు ముంచుకొస్తున్న విద్యుత్‌ సంక్షోభం – చూస్తుంటే వచ్చేది ఎండా కాలం కాదు మండే కాలమని అర్థమవుతోంది. మార్చి మూడో వారంలో కనిపించే ఎండలు ఈసారి ఫిబ్రవరి చివరి వారం నుంచే హీటు పుట్టిస్తున్నాయి. పశ్చిమ, ఉత్తరభారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 5-11 డిగ్రీల అధికంగా నమోదవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఈసారి ఎండాకాలం ఎక్కువ రోజులు కొనసాగే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంగా చల్లగా ఉండే ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈసారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 10-11 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో సంభవించే హీట్‌ వేవ్‌కు ఇది సంకేతమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుత ఉష్ణోగ్రత పరిణామాలు చూస్తుంటే వచ్చే రానున్న రోజుల్లో 45 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఎండల విషయంలో వాతావరణ విభాగాధికారులు ఆచితూచి స్పందిస్తుంటే వాతావరణ పరిశోధకులు మాత్రం ఈసారి రికార్డుస్థాయిలో ఎండలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 50 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఖాయమని చెప్తున్నారు.

ఊహించని రీతిలో ఎండలు పెరగడానికి ప్రధాన కారణం ఎల్‌నినో అంటున్నారు వాతావరణ నిపుణులు. 2011, 2012లో కనిపించిన ఎల్‌నినో ప్రభావం ఇప్పుడు తిరిగి కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఎల్ నినో’ కారణంగా వేసవి దారుణంగా ఉంటుంది. రుతుపవనాలపైనా ఆ ప్రభావం ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. నీటి కొరత, భూగర్భ జలాలు అడుగంటడం, వ్యవసాయానికి క్లిష్టతరమైన పరిస్థితులు ఏర్పడతాయని పర్యావరణవేత్తలు గట్టిగా చెప్తున్నారు. అయితే ఈపరిస్థితులు కరువుకు దారితీయకపోయినా.. సాధారణ ప్రజల జీవనాన్ని ప్రభావితం చేసి ఆర్థిక సమస్యలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఎల్‌ నినో కారణంగా జూన్‌, జూలైలో వచ్చే వర్షాలపై ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడే మాడు పగులకొడుతున్న ఎండలు రానున్న రోజుల్లో ఇంకా ఎంత తీవ్రంగా ఉంటాయోనని సాధారణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మార్చి మొదట్లోనే ఇలా ఉంటే ఏప్రిల్‌, మేలో ఎండలు ఎలా ఉంటాయోనని తల్లడిల్లుతున్నారు.

మరో వైపు ఎండలు తీవ్రం కావడం, పారిశ్రామిక, వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండటంతో తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ కనివినీ ఎరగని స్థాయికి ఎగబాకింది. మంగళవారం అంటే ఫిబ్రవరి 28న 14,794 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. గత సంవత్సరం ఇదే రోజున ఉన్న డిమాండ్‌ 12,966 మెగావాట్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అత్యధిక డిమాండ్‌.

మరో వైపు దేశవ్యాప్తంగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు సంబంధించి ఎలక్ట్రిసిటీ యాక్ట్‌లోని సెక్షన్‌ 11ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే ప్లాంట్లన్నీ పూర్తిసామర్ధ్యంతో నడపాలన్నది ఈ ఆదేశం సారాంశం. ఇలాంటి ఆదేశాలు గత సంవత్సరం మే నెలలో జారీ చేశారు. ఈ సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు NTPC విద్యుత్‌ వ్యాపార్‌ నిగమ్‌ ఇప్పటికే ఆర్డర్లు కూడా ఇచ్చేసింది.

అటు బొగ్గు సరఫరాకు సంబంధించి గతేడాది నాటి పరిస్థితులు తలెత్తే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు మార్చి నాటికి 45 మిలియన్‌ టన్నుల బొగ్గు అందుబాటులో ఉంచుతామని గతేడాది కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఉత్పత్తి, రైలు రవాణా వ్యవస్థ మెరుగపరిచినా సరఫరా మాత్రం 32 మిలియన్‌ టన్నులు దాటడం లేదు. గత సంవత్సరం బొగ్గు సరఫరా తగ్గడం, తగిన స్థాయిలో నిల్వలు లేక థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి తగ్గడంతో దేశంలోని అని రాష్ట్రాలు చీకట్లో మగ్గాయి. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కనిపిస్తున్నా అంత తీవ్రత ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశానికి అవసరమైన విద్యుత్‌ ఉత్పత్తిలో 70 నుంచి 80 శాతానికి థర్మల్‌ పవర్‌ ప్లాంట్లే దిక్కు.

విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పెరిగే వినియోగం కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ తారస్థాయికి చేరడం తథ్యం. గతేడాదితో పోల్చితే ఇప్పటికే విద్యుత్‌ డిమాండ్‌ 10 శాతం పెరిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం