బీఆర్ఎస్ నేతల సెకండ్ క్యాడర్ చేరికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఘర్ వాపసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బడా నేతల కంటే.. సెకండ్ క్యాడర్ నేతలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ పదిహేను రోజులలో భారీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2014 కంటే ముందు కాంగ్రెస్ బలంగా ఉండేది. ప్రతి గ్రామంలో బలమైన క్యాడర్ ఉండేది. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా అనేక మార్పులు జరిగాయి . ఈక్రమంలోనే కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి వలసలు పెరిగాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్న కారణంగా ప్రజలు కాంగ్రెస్‌కి ఓట్లు వేసారు. అయితే పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. గతంలో బీఆర్ఎస్కి వెళ్ళిన వారిని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకుంటుంది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందే ఈ అపరేషన్ని మొదలు పెట్టనుంది. ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇప్పటికే కొంత మంది ముఖ్య నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎంపి ఎన్నికల తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే బలమైన క్యాడర్ కోసం చేరికలని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్.
కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎర్పడినప్పటి నుంచి ఆ పార్టీ బలంగా ఉంది. ఆ పార్టీకి మళ్ళీ అవకాశం ఇవ్వకుండా గ్రామస్థాయిలో కాంగ్రెస్ పటిష్టమైన క్యాడర్ నిర్మించుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మురం చేసింది. ఇప్పటికే పలు అవిశ్వాలు పెట్టి బీఅర్ఎస్పై పైచేయి సాధించింది. చాలా మున్సిపాలిటీల నుండి బీఅర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జమ్మికుంటలో ఏకంగా పదమూడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చొప్పదండి, మానకొండూర్, వేములవాడ తదితర అసెంబ్లీల నుంచి బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించాలంటే గ్రామస్థాయిలో పటిష్టంగా ఉండాలని చేరికలని ప్రోత్సహిస్తున్నారు. ఈ పదిహేను రోజులలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాల సమీకరణాలు వేగంగా మారనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..