Bicycle Weeder: కూలీల ఖర్చు తగ్గించేందుకు రైతు వినూత్న ప్రయత్నం.. పాత సైకిల్ తో కలుపు తీసే గుంటుక యంత్రం

కరోనా మహమ్మారితో గ్రామానికి చేరిన మహేష్.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం పెట్టుబడితో పాటు కూలీల ఖర్చులు పెరిగినా.. ఆశించిన దిగుబడి రాక పెట్టుబడులు కూడా రావడం లేదు. మూడేళ్లుగా పత్తి సాగు చేస్తున్న మహేష్.. పత్తి చేలో కలుపు తీయడం, గుంటుక కొట్టించడం ఇబ్బందిగా మారింది.

Bicycle Weeder: కూలీల ఖర్చు తగ్గించేందుకు రైతు వినూత్న ప్రయత్నం.. పాత సైకిల్ తో కలుపు తీసే గుంటుక యంత్రం
Bicycle Weeder
Follow us
M Revan Reddy

| Edited By: Surya Kala

Updated on: Aug 10, 2023 | 8:12 AM

ప్రతిభ ఎవరి సొంతం కాదు.. ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు శాస్త్రవేత్తలకే పరిమితం కాదు.. రైతులు కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో కూలీల సంఖ్యను తగ్గించేందుకు ఓ రైతు వినూత్న ప్రయోగం చేశాడు. పాత సైకిల్ తో కలుపు తీసే పరికరాన్ని రూపొందించాడు.  సొంతం పొలంలో దాని సాయంతో సేద్యం చేస్తూ సాటి అన్నదాతలను ఆకర్షిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం లచ్చమ్మ గూడెంకు చెందిన గండికోట మహేష్.. కరోనా కంటే ముందు హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తుండేవాడు. కరోనా మహమ్మారితో గ్రామానికి చేరిన మహేష్.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం పెట్టుబడితో పాటు కూలీల ఖర్చులు పెరిగినా.. ఆశించిన దిగుబడి రాక పెట్టుబడులు కూడా రావడం లేదు. మూడేళ్లుగా పత్తి సాగు చేస్తున్న మహేష్.. పత్తి చేలో కలుపు తీయడం, గుంటుక కొట్టించడం ఇబ్బందిగా మారింది. కూలీల కొరతతో పాటు ఎద్దులతో గుంటుక కొట్టించడానికి ఖర్చు ఎక్కువవుతోంది.  ప్రతి రోజు గుంటుకకు ప్రతిరోజు 800 రూపాయల కిరాయి అవుతోంది.

దీంతో పత్తి చేలో ఈజీగా కలుపు తీసేందుకు సరికొత్త ఆలోచన చేశాడు. ఇంట్లో తన తండ్రి వాడిన పాత సైకిల్ తో ఓ ప్రయోగం చేశాడు. పాత సైకిల్ కు వ్యవసాయ పరికరాలను అమర్చి కలుపు తీయడం, గుంటుక కొట్టడం ప్రారంభించాడు. కూలీల కొరతను అధిగమించడం తోపాటు తక్కువ శ్రమతో ఎక్కువ పనిని చేసేందుకు ఈ సైకిల్ గుంటుక ఉపయోగపడుతుంది. ఈ సైకిల్ గుంటుక తయారీకి వెయ్యి రూపాయలు ఖర్చు అయిందని, ఒక ఎకరంలో ముగ్గురు కూలీలు చేసే పనిని ఈ సైకిల్ గుంటుకతో చేస్తున్నానని మహేష్ చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ వినూత్న పరికరంతో కలుపు తీయడం, గుంటుక కొట్టడంతో ఎకరాకు 20 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని మహేష్ చెబుతున్నారు. పత్తి చేలో ఈజీగా కలుపు తీయడం, గుంటుక కొట్టడానికి అనుకూలంగా ఉండడంతో చాలామంది రైతులు దీనిని తయారు చేయమని కోరుతున్నట్లు మహేష్ చెబుతున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయవచ్చని చెబుతున్నాడు. వ్యవసాయ పనుల్లో ఈజీగా ఉండే సైకిల్ గుంటుకను రూపొందించిన మహేష్ ను స్థానిక రైతులు అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..