AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్స్‌ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ.. యువకుడికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు

బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవదానానికి ముందుకు వచ్చి, ప్రాణదాతలుగా నిలవాలని ప్రజలకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. మరొకరికి పునర్జన్మను ప్రసాదించే అవయవాలను మట్టిలో వృథాగా కలిసిపోనియొద్దన్నారు. అవయవదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జీవన్‌దాన్ ఇంచార్జ్‌, డాక్టర్ భూషణ్ రాజు మంత్రి సూచించారు.

నిమ్స్‌ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ.. యువకుడికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు
Heart Transplant In Nims Hospital
Balaraju Goud
|

Updated on: Mar 08, 2025 | 4:46 PM

Share

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS).. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆస్పత్రి పేరు తెలియని వారుండరు.. నిత్యం పేషెంట్లతో రద్దీగా ఉండే నిమ్స్ ఆధునిక హంగులను సంతరించుకుంటోంది. హైదరాబాద్‌ , పంజాగుట్టలో ఏడో నిజాం కాలంలో నిమ్స్‌ను ఏర్పాటుచేశారు. అనంతర కాలంలో ఇది రాష్ట్రస్థాయి యూనివర్సిటీగా మారింది. నిమ్స్ ఆసుపత్రికి నిత్యం వేల మంది ఓపీ సేవలకోసం వస్తుంటారు. రోజుకు 2,500 నుంచి 3,000 మంది వరకు వస్తుంటారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కింద వేలాది మందికి ఉచితంగా చికిత్స అందిస్తుంటారు. అయితే తాజాగా తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న 19 ఏళ్ళ యువకుడికి నిమ్స్ డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెత్ అయిన మరో యువకుడి గుండెను, ఈ 19 ఏండ్ల హైదరాబాద్ యువకుడికి విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేసి విజయం సాధించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించడంతో ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటున్నాడు. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌వోడీ, డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలోని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ టెక్నీషియన్ల బృందం శుక్రవారం(మార్చి 7) శస్త్ర చికిత్సను పూర్తి చేసింది. గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్య బృందాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. అటు డోనర్ కుటుంబ సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు.

హైదరాబాద్‌లోని రసూల్‌పురాకు చెందిన పూజారి అనిల్‌కుమార్ కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. నిమ్స్‌ హాస్పిటల్‌లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే, రోడ్డు ప్రమాదంలో గాయపడిన 24 ఏళ్ళ యువకుడు, హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం(మార్చి 7) బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆ యువకుని బ్లడ్ గ్రూపునకు, అనిల్‌కుమార్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. దీంతో హార్ట్‌ను నిమ్స్‌కు తరలించి, డాక్టర్ అమరేశ్‌ బాబు నేతృత్వంలోని టీమ్‌ అనిల్‌కుమార్‌‌కు అమర్చింది.

ఆరోగ్యశ్రీ కింద అనిల్‌కుమార్‌‌కు ఉచితంగా అవయవ మార్పిడి చికిత్స చేశామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప వివరించారు. నిమ్స్‌లో గతేడాది 62 మందికి కిడ్నీ, నలుగురికి లివర్, ఇద్దరికి హార్ట్, ఒకరికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేశామని, ఈ ఏడాది 16 మందికి కిడ్నీ, ఒకిరికి లివర్, ఒకరికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశామన్నారు. 2024, 2025లో కలిపి మొత్తం 87 ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసినట్లు తెలిపారు. గతేడాది నిమ్స్‌లో ఒక వ్యక్తికి హార్ట్, లంగ్ రెండూ ఒకేసారి ట్రాన్స్‌ప్లాంట్ చేశామని బీరప్ప తెలిపారు. దేశంలోని ప్రభుత్వ దవాఖాన్లలో, ఒక్క నిమ్స్‌లో మాత్రమే ఇలా ఒకేసారి హార్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్ డాక్టర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అవయవమార్పిడి శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ల బాగోగులను పర్యవేక్షించాలని, వారికి అవసరమైన వైద్య సేవలను కొనసాగించాలని ఆయన సూచించారు. నిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను మరింత విస్తరించాలని, ఇందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గాంధీ హాస్పిటల్‌లో త్వరలోనే అధునాతన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. యువకుడికి గుండెను దానం చేసిన డోనర్ కుటుంబ సభ్యులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉండి కూడా, అతని అవయవాలు దానం చేసి మరో నలుగురికి ప్రాణం పోశారని ప్రశంసించారు.

బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవదానానికి ముందుకు వచ్చి, ప్రాణదాతలుగా నిలవాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. మరొకరికి పునర్జన్మను ప్రసాదించే అవయవాలను మట్టిలో వృథాగా కలిసిపోనియొద్దన్నారు. అవయవదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జీవన్‌దాన్ ఇంచార్జ్‌, డాక్టర్ భూషణ్ రాజు మంత్రి సూచించారు. అవయవ మార్పిడి విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు హాస్పిటళ్లపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. అవయవదానానికి సంబంధించిన కొత్త నిబంధనలను అమలు చేయబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అవయవాల అక్రమ రవాణా, సేకరణ, మార్పిడికి కఠిన శిక్షలు పడేలా కొత్త నిబంధనలు ఉండబోతున్నాయన్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us