AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్‌ 45 మినెట్స్.. కరీంనగర్ టూ వరంగల్ రూట్‌లో కొత్త హైవే.. ఓపెనింగ్ ఎప్పుడంటే?

తెలంగాణ వాసులకు .. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇదో అదిరిపోయే శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు నగరాల మధ్య రూ.1,641 కోట్లతో వ్యయంతో 68.015 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫోర్‌లైన్ హైవే దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ హైవే అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం జస్ట్ 45 మినెట్స్‌కు తగ్గనుంది.

జస్ట్‌ 45 మినెట్స్.. కరీంనగర్ టూ వరంగల్ రూట్‌లో కొత్త హైవే.. ఓపెనింగ్ ఎప్పుడంటే?
Karimnagar Warangal 4 Lane Highway
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Sep 05, 2026 | 5:08 PM

Share

ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసే కీలక ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. కరీంనగర్‌–వరంగల్‌ మధ్య జాతీయ రహదారి-563ను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్న పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య ప్రయాణం మరింత సులభం కావడంతో పాటు సమయం కూడా గణనీయంగా ఆదా కానుంది. ప్రాజెక్టు పూర్తికి ముందు భాగంగా అధికారులు శనివారం సన్నాహక పరీక్ష నిర్వహించనున్నారు.

రూ.1,641 కోట్లతో భారీ  ప్రాజెక్ట్

రూ.1,641 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మొత్తం 68.015 కిలోమీటర్ల మేర విస్తరించింది. మానకొండూరు బైపాస్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త రహదారి హనుమకొండ సమీపంలోని పలవెల్పుల వరకు కొనసాగుతుంది. మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్‌, ఎల్కతుర్తి, హసన్‌పర్తి తదితర ప్రాంతాలకు ఇది కీలక అనుసంధాన మార్గంగా మారనుంది.

కరీంనగర్‌–వరంగల్‌ జస్ట్ 45 మినెట్స్

ఇప్పటివరకు ఈ మార్గంలో 2 లైన్‌వే మాత్రమే ఉండటంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా భారీ వాహనాలను ఓవర్‌టేక్‌ చేసే సమయంలో ఇబ్బందులు, ట్రాఫిక్‌ నెమ్మదించడం, ప్రయాణ సమయం పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు ఫోర్ వే అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు చాలావరకు తగ్గనున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం కరీంనగర్‌–వరంగల్‌ మధ్య ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాల వరకు తగ్గే అవకాశం ఉంది.

అధునాతన నిఘా, భద్రతా వ్యవస్థ 

ఈ కొత్త హైవేలో కేవలం రహదారి విస్తరణకే కాకుండా ప్రయాణికుల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ATMS)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున 360 డిగ్రీల కెమెరాలను ఏర్పాటు చేసి రహదారిపై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. కేంద్ర నిఘా కేంద్రం ద్వారా ట్రాఫిక్‌ పరిస్థితిని గమనించేలా వ్యవస్థను రూపొందించారు.

ఎమర్జెన్సీ రెస్పాన్స్

ఎక్కడైనా ప్రమాదం జరిగినా, వాహనం రోడ్డుపై నిలిచిపోయినా లేదా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినా వెంటనే గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేయనున్నారు. ఇందుకోసం వేరియబుల్‌ మెసేజ్‌ సైన్‌ డిజిటల్‌ బోర్డులను ఉపయోగించనున్నారు. అత్యవసర సమయంలో సహాయం అందించేందుకు 1033 హెల్ప్‌లైన్‌, రూట్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, అంబులెన్సులు, క్రేన్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

పర్యావరణ పరిరక్షణ చర్యలు

ప్రాజెక్టులో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వర్షపు నీరు వృథాగా వెళ్లిపోకుండా భూమిలోకి ఇంకేలా 25 ప్రాంతాల్లో భూగర్భ జలాల పునరుద్ధరణ నిర్మాణాలు ఏర్పాటు చేశారు. రహదారి మధ్య భాగంతో పాటు ఇరువైపులా పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటుతున్నారు. వాటి సంరక్షణ కోసం అవసరమైన ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేశారు.

వాణిజ్య, పారిశ్రామిక రంగానికి ఊతం

ఈ రహదారి పూర్తయితే ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కరీంనగర్‌ గ్రానైట్‌ పరిశ్రమను హనుమకొండలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుతో అనుసంధానించే కీలక మార్గంగా NH-563 ఉపయోగపడనుంది. సరకు రవాణా వేగం పెరగడంతో పరిశ్రమలకు లాజిస్టిక్స్‌ ఖర్చు, సమయం తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు, ప్రాసెసింగ్‌ కేంద్రాలకు వేగంగా తరలించేందుకు కూడా ఈ మార్గం ఉపయోగపడనుంది.

వంతెనలు, ఇతర మౌలిక వసతులు

ప్రాజెక్టులో భాగంగా రహదారిపై భారీ స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. మొత్తం 9 భారీ వంతెనలు, 23 చిన్న వంతెనలు, 5 బైపాస్‌లు, 25 అండర్‌పాస్‌లు నిర్మించారు. వీటితో పాటు ఒక ఆర్వోబీ, ఒక ఆర్‌యూబీని కూడా ఏర్పాటు చేశారు. మానకొండూరు బైపాస్‌ వద్ద నిర్మించిన 560 మీటర్ల పొడవైన వంతెన ఈ ప్రాజెక్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో సరికొత్త మైలురాయి

కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల మధ్య వేగవంతమైన రవాణా సదుపాయం ఏర్పడటంతో ఈ జాతీయ రహదారి కేవలం ప్రయాణికుల మార్గంగానే కాకుండా ఉత్తర తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కీలక కారిడార్‌గా మారే అవకాశముంది. పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్యం, సరకు రవాణా రంగాలకు ఈ రహదారి కొత్త అవకాశాలను తెరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. పనులు పూర్తయి రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కరీంనగర్‌–వరంగల్‌ ప్రయాణంలో వేగం పెరగడంతో పాటు ఉత్తర తెలంగాణలో రవాణా ముఖచిత్రమే మారే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us