AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026: భారత్ జోరుకు పాక్ బేజారు.. ఆ దేశం ఖాతాలో ఉన్న పతకాల కంటే మన గోల్డ్స్ ఎక్కువ

Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో పతకాల పట్టికలో దూసుకెళ్తోంది. భారత స్వర్ణ పతకాల సంఖ్య పాకిస్థాన్ సాధించిన మొత్తం పతకాల కంటే ఎక్కువగా ఉంది. మహిళల కబడ్డీతో పాటు షూటింగ్, క్రికెట్‌లోనూ భారత్ గోల్డ్ మెడల్స్ సాధించింది. మరోవైపు పాకిస్థాన్ ఖాతాలో రెండు కాంస్య పతకాలు మాత్రమే ఉన్నాయి.

Asian Games 2026: భారత్ జోరుకు పాక్ బేజారు.. ఆ దేశం ఖాతాలో ఉన్న పతకాల కంటే మన గోల్డ్స్ ఎక్కువ
Asian Games 2026
Rakesh
|

Updated on: Sep 26, 2026 | 1:12 PM

Share

Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నారు. పోటీల ప్రారంభం నుంచి భారత్ వరుసగా పతకాలను సాధిస్తూ పతకాల పట్టికలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ముఖ్యంగా మహిళల కబడ్డీ జట్టు ఫైనల్స్‌లో ఇరాన్‌ను 37-34 తేడాతో ఓడించి దేశానికి మరో స్వర్ణ పతకాన్ని అందించింది. ఈ విజయంతో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు భారత్‌కు చిరకాల ప్రత్యర్థిగా భావించే పాకిస్థాన్ మాత్రం ఈ టోర్నమెంట్‌లో చాలా వెనుకబడిపోయింది.

పాకిస్థాన్ ఖాతాలో కేవలం రెండే పతకాలు

భారత జట్టు పతకాల వర్షం కురిపిస్తుంటే, పాకిస్థాన్ పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా తయారైంది. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో పాకిస్థాన్ జట్టు కేవలం రెండు పతకాలను మాత్రమే సాధించగలిగింది. విశేషం ఏంటంటే ఆ దేశం ఖాతాలో కనీసం ఒక్క బంగారు పతకం కూడా లేదు. పాకిస్థాన్ గెలుచుకున్న ఆ రెండు పతకాలు కూడా కేవలం కాంస్య పతకాలే కావడం గమనార్హం. ఇందులో ఒకటి పాకిస్థాన్ క్రికెట్ జట్టు సాధించగా, మరొకటి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కేజీల విభాగంలో ఆసిమ్ ఖాన్ కైవసం చేసుకున్నారు. స్వర్ణ పతకాల మాట దేవుడెరుగు, రజత పతకం సాధించడానికి కూడా ఆ దేశ క్రీడాకారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

స్వర్ణాలే పాక్ మొత్తం పతకాలకంటే ఎక్కువ

ఇరు దేశాల మధ్య పతకాల ప్రదర్శనను పోల్చి చూస్తే భూమి ఆకాశాలంత తేడా స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ ఇప్పటివరకు గెలుచుకున్న మొత్తం పతకాల (రెండు) కంటే, భారత్ ఒక్క తన ఖాతాలో వేసుకున్న స్వర్ణ పతకాల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. భారత మహిళల క్రికెట్ జట్టు, షూటింగ్ టీమ్, మహిళల కబడ్డీ జట్టు అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఈ గోల్డ్ మెడల్స్‌ను సాధించాయి. వీటితో పాటు అనేక రజత, కాంస్య పతకాలు భారత్ సాధించిన విజయాల జాబితాలో చేరాయి.

గతేనాటి రికార్డులను బద్దలు కొట్టే పనిలో భారత్

గతంలో జరిగిన 2023 ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సరికొత్త చరిత్ర సృష్టించి మొత్తం 107 పతకాలను సాధించారు. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇది భారత క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఇప్పుడు 2026లో కూడా అదే జోరును కొనసాగిస్తూ, మునుపటి రికార్డులను అధిగమించి మరింత మెరుగైన పతకాల పంట పండించాలని భారత బృందం ఉత్సాహంగా శ్రమిస్తోంది.

గత గేమ్స్‌లోనూ పేలవంగానే పాకిస్థాన్ ప్రదర్శన

కేవలం ఈసారే కాకుండా గత ఏషియన్ గేమ్స్‌లో కూడా పాకిస్థాన్ ప్రదర్శన ఎంతో నిరాశజనకంగా సాగింది. గత టోర్నమెంట్‌లో ఆ దేశం కేవలం 3 పతకాలను మాత్రమే (1 రజతం, 2 కాంస్యాలు) గెలుచుకోగలిగింది. నాటి నుంచి నేటి వరకు ఆ దేశ క్రీడా రంగానికి తగిన వసతులు, ప్రణాళికలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us