AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress in MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించని నల్గొండ కాంగ్రెస్ నేతలు.. కారణం అదేనా!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేని చోట పోటీకి సై అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి అంతో ఇంతో లోకల్ బాడీలో బలం ఉన్న నల్గొండ జిల్లా నేతలు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు.

Congress in MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించని నల్గొండ కాంగ్రెస్ నేతలు.. కారణం అదేనా!
Nalgonda Congress Leaders
Balaraju Goud
|

Updated on: Nov 24, 2021 | 5:35 PM

Share

Nalgonda Congress leaders Silence: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు రాజకీయ పార్టీల్లో జోరును పెంచాయి. వివిధ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అటు టీఆర్ఎస్ నామినేషన్ల దాఖలులో ముందంజలో ఉంది. ఇటు తెలంగాణలో రెండు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది. మెదక్ జిల్లా నుంచి నిర్మల జగ్గారెడ్డి, ఖమ్మం నియోజకవర్గానికి రాయల నాగేశ్వర్ రావు పేర్లను ప్రకటించింది అధిష్టానం.

అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేని చోట పోటీకి సై అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి అంతో ఇంతో లోకల్ బాడీలో బలం ఉన్న నల్గొండ జిల్లా నేతలు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. అన్నింటా పెత్తనం కోసం ఆరాటపడే నల్లగొండ హస్తం నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు .అందులోనూ మాటలు కోటలు దాటించే కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ఎపిసోడ్‌లో ఎక్కడున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేత్తల్లో చర్చనీయాంశంగా మారింది.

నల్గొండ కాంగ్రెస్ నేతల రాజకీయాలు ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటాయి. ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో తెలియదు. పార్టీలో అన్నింటా పెత్తనం తమకే కావాలంటారు.కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేతులెత్తేస్తారు. ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలో జరిగిన ఏ ఒక్క సమావేశానికి నల్గొండ జిల్లా నేతలు ఎవరూ హాజరుకాలేదు.

కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలుగా, పార్లమెంటు సభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊసే కరువైంది. ఇక ఒక ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్‌కు పెద్ద దిక్కులా ఉండే సీనియర్ నేత జానారెడ్డి ఉన్న కూడా స్థానికంగా బలం ఉండి కూడా పోటీకి పెట్టకపోవడంతో ఆ పార్టీ నేతల్లో పెద్ద గందగోళ పరిస్థితి నెలకొంది. కావాలని పెట్టలేదు లేక మనకెందుకులే అనుకుంటున్నారా అనేది నల్గొండ కాంగ్రెస్ లోనే కాదు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది

స్థానిక సంస్థల్లో 250కిపైగా సభ్యుల బలం ఉన్నా నల్గొండ జిల్లాలో ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగలేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, వాస్తవానికి నల్గొండ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. ఏకంగా ప్రభుత్వంతో ఛాలెంజ్ చేసి మరీ కోమటిరెడ్డి బ్రదర్స్ మాట నిలబెట్టుకున్నారు. మరి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది. పార్టీకి కీలకనేతలంతా అక్కడే ఉన్నా.. క్యాడర్ కూడా బలంగానే ఉన్నా.. ఎందుకు పోటీకి దూరంగా ఉన్నారదేని సగటు కార్యకర్తలో మెదులుతున్న ప్రశ్న.

స్థానిక సంస్థల్లో అంత బలంగాలేని ప్రాంతాల్లోనూ పలువురు పార్టీ నేతలు నామినేషన్లు దాఖలు వేశారు. నల్గొండలోనూ ఇప్పటికే కొంతమంది బీ ఫా మ్ లేకుండానే రెబల్స్‌గా నామినేషన్ వేశారు. అసలే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వచ్చిన ఓట్లతో నారాజుగా ఉన్న క్యాడర్‌లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలయినా జోష్ తెస్తాయని అనుకుంటే .. నల్గొండ నేతలు సైలెంట్ గా ఉండటంతో మరింత డీలా పడుతున్నారనే చర్చ జరుగుతోంది.

అయితే, కొంతకాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటున్నారు. పీసీసీ చీఫ్ విషయంలో ఎంపీ కోమటిరెడ్డి పోటీ పడి నిరాశచెందారు. అప్పటి నుంచి అన్నదమ్ములు ఏం చేస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ పీసీసీకి సహాయ నిరాకరణ చేస్తున్నారా.. అనే చర్చ పార్టీ నేతల్లోనూ జరుగుతోంది.

Read Also…  నా నియోజకవర్గంలో రోడ్లు ఆ బ్యూటీ బుగ్గల్లా ఉండాలి.. క్రేజీ కామెంట్‌ చేసిన మంత్రి.. ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు..