Nagoba Jatara: గంగాజలాభిషేకంతో ప్రారంభమైన నాగోబా జాతర మహా ఘట్టం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతర గిరిజనుల సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభం కాగా, ఆదివాసీ గిరిజన..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతర గిరిజనుల సాంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభం కాగా, ఆదివాసీ గిరిజన సంస్కతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ మహోత్సవం నిర్వహించారు. పవిత్ర గంగాజలంతో ఆరాధ్య దైవాన్ని అభిషేకించడంతో మొదలైన నాగోబా జాతర, వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది.
చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఉన్న మెస్రం వంశీయులు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కెస్లాపూర్‌కు చేరుకోవడంతో సందడి నెలకొంది. గంగాజలాభిషేక సమయంలో మెస్రం పెద్దలకు ఆదిశేషుడు దర్శనమిస్తారని బలంగా నమ్ముతారు. నాగశేషుని దర్శనం తర్వాతే జాతర ప్రారంభమైనట్లు ప్రకటించారు. మట్డితో మెస్రం ఆడపడుచులు చేసిన ఏడు రకాల పాముల పుట్టలను జాతర సమయంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతో పాటు ఆదివాసులు నమ్ముతారు.
సంస్కృతి మరువని గిరిజనానికి నాగోబా జాతర నిలువెత్తు నిదర్శనం. ఈ ఏడాది సొంత డబ్బులతో నిర్మించుకున్న ఆలయంలో జాతర వైభవంగా జరుగుతోంది. నాగోబా దేవతకు మెస్రం వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తారు. మెస్రం వంశంలో 22 తెగలు ఉండగా.. మడావి, మర్సుకోల, పుర్కా, మెస్రం, వెడ్మ, ఫంద్రా, ఉర్వేత ఇంటి పేర్లతో ఉన్న మెస్రం వంశీయులకే ప్రదాన పూజకు అర్హత ఉన్నట్లు భావిస్తారు. గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర ప్రారంభమైంది. అర్థరాత్రి గంగా జలాభిషేకంతో నాగోబాను అభిషేకించి తుడుం మోగించి నాగోబా జాతరను ప్రారంభించారు మెస్రం వంశీయులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి