Khammam: భారీ వర్షాలతో మున్నేరు వాగు మహోగ్రరూపం… జలదిగ్బంధంలో ఖమ్మం పట్టణం

ఖమ్మం పట్టణాన్ని వరద ముంచెత్తింది. మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. మున్నేరుకు వరద పోటెత్తడంతో ఖమ్మం సిటీలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రకాష్‌నగర్ దగ్గర బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతుండడంతో వందలాది ఇళ్లు జలమయం అయ్యాయి. వరద ముంపులో చిక్కుకున్న వందలాది మంది బాధితులు ఆదుకోవాలంటూ ఆర్తనాదాలు చేశారు.

Khammam: భారీ వర్షాలతో మున్నేరు వాగు మహోగ్రరూపం... జలదిగ్బంధంలో ఖమ్మం పట్టణం
Khammam Heavy Rains
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Sep 01, 2024 | 8:01 PM

ఖమ్మం పట్టణాన్ని వరద ముంచెత్తింది. మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. మున్నేరుకు వరద పోటెత్తడంతో ఖమ్మం సిటీలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రకాష్‌నగర్ దగ్గర బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతుండడంతో వందలాది ఇళ్లు జలమయం అయ్యాయి. వరద ముంపులో చిక్కుకున్న వందలాది మంది బాధితులు ఆదుకోవాలంటూ ఆర్తనాదాలు చేశారు.

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం అతలాకుతలం అవుతోంది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఖమ్మం మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. ఖమ్మం పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌ దగ్గర మున్నేరువాగు డేంజర్‌ లెవల్లో ప్రవహిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకాశ్‌నగర్‌ దగ్గర మున్నేరు గోదావరినదిని తలపిస్తోంది. మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. ప్రకాష్‌నగర్‌ పూర్తిగా నీట మునిగింది. దాంతో.. ఖమ్మం సిటీలోని పలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరింది. ఇళ్ల మధ్య నుంచే మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న కాలనీలవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రధానంగా.. ఖమ్మం సిటీలోని కవిరాజ్‌నగర్‌, వీడియోస్‌ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపురం హవేలీ, మమత హాస్పిటల్‌ రోడ్డు, కాల్వ ఒడ్డు.. దాదాపు పదుల సంఖ్యలో కాలనీల్లోని వరద నీరు పోటెత్తింది. పలు చోట్ల వరదలో చిక్కుకున్నవారు.. సాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం నగరంలోని కల్యాణ్‌నగర్‌ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. నడుముల్లోతు నీరు చేరడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు. అటు.. ఖమ్మం సిటీలోని మున్నేరు వాగుకు వరద పోటెత్తడంతో ఏడుగురు వ్యక్తులు చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల దగ్గర ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సరదాగా వాగు ఉధృతిని చూడడానికి వెళ్ళిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.

ఖమ్మం పట్టణంలోని కరుణగిరి సాయికృష్ణనగర్‌ను వరద చుట్టుముట్టడంతో వందలాదిమంది ఇబ్బంది పడ్డారు. రెండస్థుల మేర వరద ప్రవాహం కొనసాగుతుండంతో ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుక వెళ్లదీశారు. కాపాడాలంటూ ఆవేదన వ్యక్తం చేయడంతో టీవీ9 ద్వారా సమాచారం తెలుసుకుని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే.. మున్నేరు బ్రిడ్జి పక్కన బొక్కలగడ్డ ప్రాంతంలోనూ రెండంతస్తుల బిల్డింగ్‌లో ముగ్గురు చిక్కుకున్నారు. రక్షించాలని వేడుకోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాజీవ్‌ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం చిక్కుకోగా.. వారిలో పిల్లలతో పాటు మహిళ, వృద్ధురాలు ఉన్నారు. వెంకటేశ్వరనగర్‌లో ఓ ఇంటిని మున్నేరు వరద చుట్టుముట్టింది. గణేశ్‌నగర్‌, దానవాయిగూడెం ప్రాంతాల్లోనూ చాలా ఇళ్లు నీట మునిగాయి. ప్రకాశ్​ నగర్​ దగ్గర మున్నేరు బ్రిడ్జిపై వరదలో చిక్కినవారిని ఏపీ నుంచి వచ్చిన హెలీకాప్టర్ల సాయంతో రక్షించారు.

ఇక.. ఖమ్మం పట్టణాన్ని వరద ముంచెత్తడంతో మంత్రులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం చేరుకుని వరద పరిస్థితులను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క.. అధికారులను ఆరా తీశారు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహించే రోడ్లపై వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖను ఆదేశించారు. భట్టి విక్రమార్క. మొత్తంగా ఖమ్మం పట్టణాన్ని గతంలో ఎన్నడూ చూడని రేంజ్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఖమ్మం సిటీలోని కాలనీలకు కాలనీలే.. జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వరద ముంపు బాధితులు అల్లాడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..