Medchal: కామమోహంలో కన్నబిడ్డను బలి చేసిన తల్లి.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వేళ ఏడ్చాడని..
ప్రియుడితో ఉన్న సమయంలో అడ్డువస్తున్నాడనే కారణంతో రెండేళ్ల కుమారుడిని తల్లి, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. ఫిట్స్‌తో మృతి చెందినట్లు నమ్మించి అంత్యక్రియలు నిర్వహించినా, 20 రోజుల తర్వాత నిజం బయటపడడంతో పోలీసులు తల్లిని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

కన్నప్రేమ కరువైంది. కామమోహంలో కళ్లు మూసుకుపోయిన ఓ తల్లి, కళ్లముందే తిరుగుతున్న తన రెండేళ్ల కుమారుడిని కిరాతకంగా హత్య చేసింది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో అడ్డువస్తున్నాడనే కారణంతో చిన్నారిని నేలకేసి కొట్టి చంపేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు నటిస్తూ, ఫిట్స్ రావడంతో మృతి చెందాడని భర్తను నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహించింది. అయితే, ఇరవై రోజుల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి, జ్యోతి దంపతులు ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కీసరలో నివాసం ఉంటున్నారు. స్వామి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు హరికృష్ణ ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, జ్యోతికి పెళ్లికి ముందే యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్‌తో పరిచయం ఉండేది. వివాహం అనంతరం కూడా ఆ పరిచయం వివాహేతర సంబంధంగా కొనసాగింది. భర్త విధులకు వెళ్లిన సమయంలో నవీన్ తరచూ జ్యోతి ఇంటికి వచ్చేవాడని పోలీసులు తెలిపారు. గత నెల 29న కూడా స్వామి డ్యూటీకి వెళ్లిన తర్వాత నవీన్ ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెండేళ్ల హరికృష్ణ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. దీంతో కోపానికి గురైన నవీన్, “ఈ బిడ్డ అడ్డుగా ఉన్నాడు.. చంపేద్దాం” అని చెప్పగా, జ్యోతి కూడా అంగీకరించినట్లు విచారణలో వెల్లడైంది. ఇద్దరూ కలిసి చిన్నారి కాళ్లు పట్టుకుని గాల్లోకి ఎత్తి నేలకేసి బలంగా కొట్టారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య అనంతరం జ్యోతి, తన కుమారుడు ఫిట్స్ రావడంతో చనిపోయాడని భర్తను నమ్మించింది. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామమైన తీగుల్‌కు తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్వామి, బంధువుల సమక్షంలో జ్యోతిని నిలదీశాడు. దీంతో ఆమె జరిగిన విషయాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. వెంటనే స్వామి కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తీగుల్ గ్రామంలో చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి, మేజిస్ట్రేట్ సమక్షంలో రీ-పోస్టుమార్టం నిర్వహించారు. నిందితురాలు జ్యోతిని అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇరవై రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
