కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?
సూర్యాపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం, మత్తు పదార్థాలకు బానిసై తరచూ డబ్బు కోసం వేధిస్తున్న కొడుకును ఓ తల్లి గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత ఎవరో దాడి చేశారని చెప్పిన తల్లి, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో అరెస్టయ్యింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రేమకు ప్రతిరూపం.. తల్లి. లోకంలో తల్లి ప్రేమ కంటే స్వచ్ఛమైనది, గొప్పది మరొకటి ఉండదు. పిల్లల కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేందుకు కూడా సిద్ధమవుతుంది. ప్రేమకు మారుపేరుగా నిలవాల్సిన ఓ తల్లి, తన కన్న కొడుకును కడతేర్చింది. వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణం 18 వ వార్డు సుందరయ్య నగర్ కాలనీలో నివాసం ఉంటున్న భూక్యా అచ్చికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త రాము కొన్నాళ్ల క్రితం మృతిచెందగా, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. ఉన్నంతలో ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేసింది. కొడుకు విజయ్ ని కూడా ఇంటర్ వరకు చదివించింది.
కొడుకు విజయ్ తనకు చేదోడు వాదోడుగా ఉంటాడని భావించింది. కానీ..మద్యం, మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. ప్రతిరోజూ మద్యం మత్తులో డబ్బు కోసం తల్లిని వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక, తీవ్రమైన ఒత్తిడికి లోనై ఈ నెల 12వ తేదీ రాత్రి మద్యం మత్తులో ఉన్న విజయ్‌పై తల్లి అచ్చి గొడ్డలితో దాడికి పాల్పడింది. కొద్దిసేపు ఇంటి బయట కూర్చున్న తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా, విజయ్ ప్రాణాలతో ఉన్నాడు.
దీంతో ఆందోళన చెందిన అచ్చి.. తన కుమారుడిపై ఎవరో వ్యక్తులు దాడి చేశారని స్థానికులకు చెప్పటంతో సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈ నెల 13వ తేదీ రాత్రి మృతిచెందాడు. కుమార్తె దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు విచారణ జరిపి నిందితురాలైన తల్లి అచ్చిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కన్నతల్లే కొడుకు చంపి.. ఎవరో చంపారంటూ ఫిర్యాదు చేసిందని.. విచారణలో కీలక విషయాలు వెలుచూశాయని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
