Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని చంపేసిన ‘కోతుల మంద’..!
Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోతుల మూక ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ఎవరూ లేని సమయంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోతుల మూక ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ఎవరూ లేని సమయంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్ర రక్తస్రావంతో వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జిల్లా పరిధిలోని ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత సూర్యపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు పక్షవాతంతో మంచాన పడింది. ఆమె ఇంట్లో, సమీపంలో ఎవరూ లేకపోవడంతో కోతులు చొరబడ్డాయి. అదే సమయంలో వృద్ధురాలు కనిపించడంతో ఆ కోతుల మూక దాడికి దిగాయి. కోతుల గుంపు మూకుమ్మడి దాడి చేయడంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆ గాయలు తాళలేక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపుతోంది. కోతుల గుంపు ఒక వ్యక్తి ప్రాణాలు తీయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఊళ్లో కోతుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని, కోతుల బెడద నుంచి రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు గ్రామస్తులు. కోతుల గుంపు ఇళ్లలోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్తున్నాయని, బెదిరించిన వారిపై దాడులకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతోనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, వృద్ధురాలిని కోతులు చంపేయడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. కోతులను పారద్రోలేందుకు రంగంలోకి దిగారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..