మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ సరిహద్దును అనుకోని కొండ కొనల మధ్య ఒక గూడెం ఉన్నది. అదే దొరవారి తిమ్మాపురం. ఈ గూడెంలో కేవలం 40 ఇండ్లు మాత్రమే ఉంటాయి. విరి జీవన విధానం అంత ప్రకృతి పైనే, అమాయక కోయ జాతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఆరుతడి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తుంటారు. వీరికి సరిహద్దు గ్రామాలతో సంబంధాలు ఉండాలంటే దాదాపు 18 కిలోమీటర్ల పరిధి. గూడెంలో ఉన్న వ్యక్తికి ఏ కష్టం వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా.. ఏదైనా ప్రమాదం సంభవించినా.. ఆసుపత్రి పోయే లోపే ప్రాణాలు పోతాయి. ఈ గూడెంలో నివసించే వారికి బయటి ప్రజలు పెళ్లి సంబంధాలకు కూడా ముందుకు రారంటే..! పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించాలి.
ఇలాంటి కోయ గుడానికి పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అష్ట కష్టాలు పడి ఉదయం తన ప్రయాణాన్ని మొదలు పెడితే అక్కడికి చేరుకునే లోపు మధ్యానం 2గంటలు దాటింది. వారి అభిప్రాయాలు పంచుకొని.. ఇంటింటికీ తిరిగివారి జీవన శైలిని పరిశీలించి వారితో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. ఒక వృద్ధురాలికి అన్నం తినిపించి అందరి మనసును చూరగొన్నారు. గూడెం వాసుల కష్టనష్టాలు విన్నారు. వరదల సమయంలో నిత్యవసర వస్తువులకు ఆర్థిక సహాయం చేశారు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇండ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేసి రోడ్లు వేయించి గూడెం వాసుల కష్టాలు తీరుస్తానని, 25 ఇండ్లకు వెంటనే తన సీడీఎఫ్ నిధులు నుండి రూ. 10 లక్షల నిధులను సీసీ రోడ్డుకి మంజూరు చేశారు.
తమ మారుమూల గిరిజన గూడెంకి కొండలు, కొనలు, వాగు వంకలు చెట్లు పుట్టలు దాటి ఇలా అన్ని కష్టాలను ఎదుర్కొని రావడం సంతోషమనీ, చరిత్రలో ఏ పాలకుడు రాని మా దొరవారి గూడెం కి వచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మా గూడెం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటామని అనందం వ్యక్తం చేశారు.
అయితే, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారు దిగాక, సుమారు 14 కిలోమీటర్లు స్వంతంగా ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళారు. ఆ తర్వాత 5 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేశారు. ఆ తర్వాత కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు. ఫొటోల కోసం అయితే కిలోమీటరో లేదా అర కిలోమీటరో డ్రైవింగ్ చేసి, ఫొటోలకు పోజులు ఇచ్చి గమ్మున ఉండే వారు. కానీ అలా కాకుండా దారి మొత్తం ట్రాక్టర్ పై అన్నీ శాఖల అధికారులను ట్రాక్టర్ డబ్బాలో ఎక్కించుకొని వెళ్ళారు.
అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కదా ఇన్ని రోజులు రోడ్లు ఎందుకు వెయ్యలేదు అనే సందేహం రావొచ్చు. ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు వేయాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. పక్కా ఇల్లు వెంటనే మంజూరు చేసి, బ్రిడ్జి కోసం, రోడ్డు కోసం సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఎమ్మెల్యే ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..