Talasani Srinivas Yadav: ఆ రెండు పార్టీలు కేవలం ప్రజల తిట్లకే పరిమితం అవుతాయి: తలసాని
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఒకరికంటే ఒకరు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారు తమ ప్రచారాన్ని..

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఒకరికంటే ఒకరు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ల వల్ల ప్రయోజనం లేదని, టీఆర్‌ఎస్ వల్లే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రజా సమస్యలను వదిలేసి ఆ రెండు పార్టీలు కేవలం తిట్లకే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం ఉప్పరిగూడ, ముదిరాజ్‌కాలనీలో ప్రచారం చేశారు తలసాని. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
మూడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఏం చేశారో, ఎందుకు గెలిపించాలో మునుగోడు ప్రజలకు చెప్పే ధైర్యం రాజగోపాల్ రెడ్డికి కానీ, బీజేపీ నేతలకు కానీ లేదని ఆయన విమర్శించారు. ఎవరు ఎన్నిక కుట్రలు పన్నినా మునుగోడు ప్రజలు తమ అభ్యర్థినే గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల నేతలు కూడా ఎవరికి వారు తమ ప్రచారం ముమ్మరం చేసుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ కూడా ముందు నుంచే దూకుడు ప్రదర్శిస్తోంది. అందులో కాంగ్రెస్ కూడా దూసుకుపోతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..







