
బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. “అసెంబ్లీలో చెప్పాల్సిన విషయాలను.. సభకు రాకుండా డుమ్మాలు కొట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి.. బహిరంగ సభలు పెట్టి అమాయకుల ప్రాణాలు తీయడం మానుకోవాలని” మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. సభకు రావాలని ప్రతిరోజు ఆహ్వానాలు పంపినా.. కేసీఆర్ వైపు నుంచి స్పందనం లేకపోవడం ఆయన దొరతనానికి నిదర్శనమని మంత్రి కోమటరెడ్డి అన్నారు. కేసీఆర్ వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో వారే గట్టిగా బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. దేశంలోనే అత్యంత భారీగా తొమ్మిది వందల కోట్ల పార్టీ ఫండ్ కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. నల్గొండ వద్ద ఎమ్మెల్యే లాస్యా నందితా కారు క్రింద పడి చనిపోయిన హోంగార్డు నవ కిషోర్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
అసందర్భంగా, అవసరం లేకున్నా.. వందల కోట్లు ఖర్చుపెట్టి 30వేల మందితో సభ ఏర్పాటు చేశారన్నారు. అబద్ధాలు, అసత్యాలు చెప్పి ప్రజలను ఆగం చేయాలని చూస్తున్నారు. ఇలా కుట్రలు చేయడం కేసిఆర్‌కు తగదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదని వందలాది కార్లతో ర్యాలీలు పెట్టి ఓ నిరుపేద హోగాంర్డు ప్రాణం తీయడం ఎంత వరకు సబబని నిలదీశారు. చనిపోయిన హోంగార్డుకు వ్యక్తిగతంగా రెండు లక్షల ఆర్ధిక సహాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి.. ప్రభుత్వం తరఫున ఆయన భార్యకు ఉద్యోగం, వారి పిల్లల చదువులు పూర్తయ్యే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జీ.ఓ.నెం. 46 పెట్టి నల్గొండ యువత పొట్టగొట్టిన కేసీఆర్.. సభ పెట్టి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ అండ్ కో తమ స్వార్ధ రాజకీయాలకు అమాయకులను బలితీసుకోవడం మానుకొని.. హోంగార్డు కుటుంబానికి తక్షణం కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..