Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. లైన్‎లో ఎవరెవరున్నారంటే!

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పెరుగుతోంది. పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈసారి కచ్చితంగా ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవాలని పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

Telangana Congress: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కొనసాగుతున్న ఉత్కంఠ..  లైన్‎లో ఎవరెవరున్నారంటే!
Gandhi Bhavan
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 19, 2023 | 12:16 PM

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పెరుగుతోంది. పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈసారి కచ్చితంగా ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవాలని పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గవర్నర్ కోటాలో రెండు సీట్లు, ఇతర కోటాలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ 6 స్థానాలకు పోటీ పడే నేతల జాబితా మాత్రం ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని పలువురు నేతలకు ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు ఆ నేతలంతా ఎమ్మెల్సీ సీటు కావాలని కోరుతున్నారు.

ఆ జాబితాలో మాజీమంత్రి చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్ సహా పలువురు ఉన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, సంపత్ కుమార్, పోదెం వీరయ్య, మధు యాష్కీ, ఫిరోజ్ ఖాన్, అంజన్ కుమార్ యాదవ్ ఈ రేసులో ముందు వరుసలో ఉన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటు మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పోదెం వీరయ్య ఇప్పటికే లేఖ కూడా రాశారు.

వీరితో పాటు పొత్తుల్లో భాగంగా పలువురు ఇతర పార్టీల నేతలు కూడా ఈసారి ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. వీరిలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కించుకుంటే.. మంత్రిగా రేసులో ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆశావాహుల పేర్ల జాబితాను అధిష్టానం పెద్దల ముందు ఉంచబోతున్నారని తెలుస్తోంది.

మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అయితే ఫిరోజ్‌ ఖాన్‌ నుంచి ఆయన పోటీని ఎదుర్కోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే మంత్రివర్గంలోకి కొందరు ఎమ్మెల్సీలను కూడా తీసుకునే అవకాశం ఉండటంతో.. మంత్రివర్గ విస్తరణకు ముందే పలువురికి ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కవచ్చని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…