AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Polls 2024: తెలంగాణలో మళ్లీ మొదలైన ఎన్నికల వేడి.. లోక్‌సభ పోల్స్‌పై బీఆర్ఎస్ ఫోకస్.. !

2024 General Elections: దేశవ్యాప్తంగా 6-7 విడతల్లో లోక్‌‌సభకు పోలింగ్‌ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తొలి దశలోనే తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండోవారంలోపే వస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

Lok Sabha Polls 2024: తెలంగాణలో మళ్లీ మొదలైన ఎన్నికల వేడి.. లోక్‌సభ పోల్స్‌పై బీఆర్ఎస్ ఫోకస్.. !
BRS Working President KTR and Harish Rao (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 19, 2023 | 12:41 PM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేడి అప్పుడే మొదలయ్యింది. నిర్ణీత గడువు కంటే నెల రోజుల ముందే లోక్‌సభ ఎన్నికలు జరగొచ్చన్న ఊహాగానాలతో తెలంగాణ రాజకీయ పార్టీలు అలెర్ట్ అయ్యాయి. నియోజకవర్గాలకు ఇంఛార్జిలను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్.. తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయాలంటూ తీర్మానం చేసింది. లోక్‌సభ ఎన్నికల హీట్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలను బీఆర్‌ఎస్‌ కూడా నిశితంగా గమనిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను సమీక్షించుకుని.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశగా బీఆర్ఎస్ నాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది

క్షేత్రస్థాయిలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సమీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ కూడా కొద్దిరోజుల్లోనే లోక్ సభ ఎన్నికలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏ మాత్రం జాప్యం కాకుండా చూడాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రచారంపై ఫోకస్ చేయాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ప్రచార వ్యూహాలపై కూడా ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది బీఆర్ఎస్ నేతల వ్యూహంగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోల్చితే 2 శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్‌కు తగ్గాయి. ఆచరణ సాధ్యంకాని హామీలు, దుష్ప్రచారంతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఖాయంగా తెలుస్తోంది. కాంగ్రెస్, అటు బీజేపీని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలతో ముందుకెళ్లాలని  బీఆర్ఎస్ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా 6-7 విడతల్లో లోక్‌‌సభకు పోలింగ్‌ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తొలి దశలోనే తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండోవారంలోపే వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. లోక్‌సభ తొలిదశ ఎన్నికలు ఏప్రిల్‌ పదో తేదీలోపే ఉంటాయని, తెలంగాణలో ఈ విడతలోనే లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. మలిదశ పోలింగ్‌ మే తొలివారం వరకు ఉంటుందని, ఫలితాలు మే 15 లోపే ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది.