Telangana: ముగ్గురు మైనర్ బాలికలను చిదిమేసిన కామాంధుడికి ఏం శిక్ష పడిందో తెలుసా..!
ముగ్గురు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆరోపణలపై 59 ఏళ్ల శివరాత్రి ముత్తయ్య అనే వ్యక్తికి 60 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కో నేరానికి 20 ఏళ్ల చొప్పున శిక్ష విధిస్తూ జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అంతేకాదు బాధితులకు ఒక్కొక్కరికి 2లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఓ కామాంధుడికి కోర్టు తగిన శిక్ష విధించింది.. ముగ్గురి మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తికి కఠిన కారాగార శిక్ష విధించింది. 60 ఏళ్ళ పాటు జైలు జీవితం గడుపాల్సిందేనంటూ జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ముగ్గురు మైనర్ బాలిక పై నిందితుడు శివరాత్రి ముత్తయ్య అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్‌ఐ నరేష్ కేసు నమోదు చేశారు. డీఎస్పీలు వెంకటస్వామి, రఘుచందర్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకు పూర్తి ఆధారాలు సమర్పించారు.
కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు అన్ని అంశాలు పరిశీలించి నిందితుడు నేరం చేశాడని భావించింది. ఈ క్రమంలో నిందితుడికి ఒక్కొక్క కేసులో 20 సంవత్సరాల చొప్పున మొత్తం 60 సంవత్సరాలు కఠిన కారాగారా జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించారు. అంతేకాకుండా బాధిత బాలికలకు ఒక్కొక్కరికి 2లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ముత్తయ్యను కోర్టు ఆదేశించింది..
ఈ సందర్బంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరన్నారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ వ్యూహంతో న్యాయ విచారణ, నేర నిరూపణ వేగవంతగా జరిపి ఖచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని అన్నారు. ఈ శిక్ష కామాంధులకు హెచ్చరికలాంటిదన్నారు. అమ్మాయిల పట్ల గౌరవంగా ఉండాలని కోరారు. ఈ కేసును వేగవంతం చేసి కోర్టుకు ఆధారాలు సమర్పించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..