Telagana: వీడెవడండీ బాబూ..! దొబ్బేసిన చోటే దొరికిపోయాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్!
వరుస చోరీలతో కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగ నాటకీయంగా పోలీసులకు చిక్కాడు. పోలీసుల నుంచి తప్పించుకుని ఆరేళ్లుగా అడ్రస్ లేకుండా తిరుగుతున్న చాపలి భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ అదే ప్రాంతంలో చోరీకి ప్రయత్నం చేసస్తూ ఖాకీల చేతికి దొరికిపోయాడు. అతని నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఎక్కడ తప్పించుకున్నాడో.. మళ్ళీ అక్కడే దొరికాడు. గతంలో వరుస చోరీలు చేసి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్ళాడు. అక్కడ నుంచి తప్పించుకుని ఆరేళ్లుగా అడ్రస్ లేకుండా తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ అదే ప్రాంతంలో చోరీకి ప్రయత్నం చేసి ఖాకీల చేతికి చిక్కాడు. నారాయణపేట జిల్లాలోనే ఆసక్తి రేపుతోంది ఓ ఘరానా దొంగ ఉదంతం.
బంగారు నగలు, పట్టగొలుసులు, ఉంగరాలు నగల దుకాణాల్లో ఉండాల్సి వస్తువులన్నీ పోలీస్ స్టేషన్‌లో ప్రదర్శించారు. ఇది ఒక దొంగ తో దోచుకున్న ప్రజల సొత్తు. అదే పనిగా దొంగతనాలకు అలవాటుపడి చిక్కడు-దొరకడు అన్నట్టు నారాయణపేట జిల్లాలో పోలీసులకు సవాల్ విసిరి చివరకు కటకటాల పాలయ్యాడు ఓ ఘరానా దొంగ. వరుస చోరీలతో కంటిమీద కునుకు లేకుండా చేసిన చాపలి భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఊట్కూరు మండల కేంద్రానికి చెందిన చాపల భాస్కర్ చోరీ ప్రస్థానం ఇప్పటిది కాదు. 2016 నుంచి మక్తల్, ఊట్కూరు, మద్దూరు తదితర ప్రాంతాల్లో చోరీలు చేసి పట్టుబడి జైలుకు సైతం వెళ్ళాడు. ఈ క్రమంలోనే 2018 ఆగస్టు 10వ తేదీన జైలులోనే గొంతు కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం పోలీస్ ఎస్కార్ట్ తో మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడి నుంచి పోలీసుల కళ్ళు గప్పి పారిపోయాడు.
ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులో ఉండి తిరిగి హైదరాబాద్ కు వచ్చి కాటేదాన్ ఏరియాలో కొంతకాలం కూలీ పని చేశాడు. అయితే చోరీలకు అలవాటు పడ్డ భాస్కర్ కు కూలీ పని డబ్బులు సరిపోలేదు. దీంతో మళ్లీ చోరీలకు స్కెచ్‌లు వేశాడు. ఎక్కడైతే గతంలో పోలీసులకు చిక్కాడో, మళ్ళీ అక్కడి నుంచి దొంగతనాలను పునః ప్రారంభించాడు. నారాయణపేట, మరికల్, మక్తల్, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బొమ్రోస్పిట్, పరిగి ఏరియాలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులకు చిక్కకుండా వరుస చోరీలతో సవాల్ విసిరాడు. ఇదే క్రమంలో తాజాగా మరికల్‌లో దొంగతనం చేయడానికి రాగా పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద నుండి రూ. 19.40 లక్షల రూపాయల విలువైన 248 గ్రాముల బంగారం, దాదాపు రూ. 1.50 లక్షల విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేయడానికి ఉపయోగించే ఒక ఐరన్ రాడ్ అతని బ్యాగును సీజ్ చేశారు. వరుస చోరీలతో కంటిమీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగ చాపలి భాస్కర్ చిక్కడంతో ఇటు నారాయణపేట, అటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..