Hyderabad: హైదరాబాద్‌లో బీజేపీ గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? అసద్‌ను ఓడించడం సాధ్యమేనా..?
ఇటు తెలంగాణలోనూ డబుల్ డిజిట్ పార్లమెంటరీ స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే తక్కువలో తక్కువ 10 స్థానాలు గెలవాలన్నది కమలనాథుల లక్ష్యం. పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలపై బీజేపీ ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా దశాబ్ధాలుగా తమకు అందని ద్రాక్షగా ఉన్న హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంపైనా కమలనాథులు కన్నేశారు. ఇక్కడ మంచి ఫామ్‌లో ఉన్న అసదుద్దీన్ ఒవైసీని ఓడించాలని పట్టుదలగా ఉన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దేశంలో 400 సీట్లు సాధించే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పార్టీ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేసింది. ఇటు తెలంగాణలోనూ డబుల్ డిజిట్ పార్లమెంటరీ స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే తక్కువలో తక్కువ 10 స్థానాలు గెలవాలన్నది కమలనాథుల లక్ష్యం. పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలపై బీజేపీ ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా దశాబ్ధాలుగా తమకు అందని ద్రాక్షగా ఉన్న హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంపైనా కమలనాథులు కన్నేశారు. హైదరాబాద్‌లో కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలనాథులు సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. దీని కోసం వారు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
హైదరాబాద్ నియోజకవర్గం మొదటి నుంచీ మజ్లీస్ పార్టీ (ఎంఐఎం)కి కంచుకోటగా ఉంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వరుసగా నాలుగుసార్లు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. 2004 నుంచి ఈ నియోజకవర్గానికి అసద్ ప్రాతినిధ్యంవహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జే భగవంత్ రావుపై 2.82 లక్షల కోట్ల మెజార్టీతో అసదుద్దీన్ విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీకి 5.17 లక్షల ఓట్లు దక్కగా.. డాక్టర్ భగవంత్ రావుకు 2.35 లక్షల ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి పీ శ్రీకాంత్‌కు 63 వేల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌కు 49 వేల ఓట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లోనూ డాక్టర్ భగవంత్ రావుపై 2.02 లక్షల ఓట్ల మెజార్టీతో అసద్ గెలుపొందారు. నాటి ఎన్నికల్లో అసద్‌కు 5.13 లక్షల కోట్లు దక్కగా, భగవంత్ రావుకు 3.11 లక్షల కోట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణా రెడ్డికి 49 వేలు, బీఆర్ఎస్ అభ్యర్థి రషీద్ షరీఫ్‌కు 37 వేల ఓట్లు వచ్చాయి. అంతకు ముందు 2009 ఎన్నికల్లో అసదుద్దీన్ 1.13 లక్షల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి జహీద్ అలీ ఖాన్‌పై విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో అసద్‌కు 3.08 లక్షల ఓట్లు దక్కగా.. జహీద్ అలీ ఖాన్ (టీడీపీ)కు 1.94 లక్షల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పీ.లక్ష్మణ్ రావు గౌడ్‌కి 93 వేల ఓట్లు, బీజేపీ అభ్యర్థి సతీష్ అగర్వాల్‌కు 75 వేల ఓట్లు పోల్ అయ్యాయి.
1984 నుంచి ఒవైసీల అడ్డాగా హైదరాబాద్..
ముస్లీం ఓటర్లు 35 శాతానికి పైగా ఉండే హైదరాబాద్ నియోజకవర్గంలో 1984 నుంచే ఎంఐఎం హవా నడుస్తోంది. ఎంఐఎం మాజీ చీఫ్, అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 1984 నుంచి వరుసగా ఆరుసార్లు ఈ నియోజకవర్గ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి అసదుద్దీన్ ఒవైసీ వరుసగా నాలుగు సార్లు హైదరాబాద్ ఎంపీగా ప్రాతినిథ్యంవహిస్తున్నారు. సుల్తాన్ సలావుద్దీన్, అసద్ ఇద్దరూ 1984 నుంచి ఇప్పటి వరకు 10సార్లు హైదరాబాద్ నుంచి వరుసగా ఎంపీగా గెలుస్తున్నారు. 1996లో బీజేపీకి చెందిన ఎం.వెంకయ్య నాయుడు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి 73,273 ఓట్ల తేడాతో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ చేతిలో ఓటమిచెందారు. 1999లో బీజేపీ అభ్యర్థి బద్దం బాల్ రెడ్డి ఓడినా..నాటి ఎన్నికల్లో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీకి గట్టిపోటీ ఇచ్చారు.ఆ ఎన్నికల్లో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ కేవలం 60,821 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు 4.48 లక్షల ఓట్లు దక్కగా.. బద్దం బాల్ రెడ్డికి 3.87 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కొండా లక్షా రెడ్డి 2 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. 2004 నుంచి 2019 వరకు అసద్‌కు దక్కుతున్న మెజార్టీ పెరుగుతూనే ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి గెలిచిన ఎంఐఎం
ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎంఐఎంను ఓడించడం అంత ఈజీ కాదన్న విషయం కమలనాథులకు బాగా తెలుసు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు బీజేపీలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మలక్‌పేట్, కార్వాన్, గోషా మహాల్, ఛార్మినార్, చాంద్రాయణ్‌గుట్ట, యాకత్‌పురా, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గోషా మహల్‌లో రాజా సింగ్ (బీజేజీ) మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలను ఎంఐఎం కైవసం చేసుకుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం గెలుపు కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది.
యాకుత్ పురా నియోజకవర్గంలో ఎంబీటీ అభ్యర్థి అమ్జదుల్లా మీద కేవలం 810 ఓట్లతో ఎంఐఎం విజయం సాధించింది. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ మీద ఎంఐఎంకు దక్కిన మెజార్టీ 2,175 ఓట్లు మాత్రమే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటితో పోల్చితే ఎంఐఎం మెజార్టీ బాగా తగ్గాయి. అక్బరుద్దీన్ ఒవైసీ గెలిచిన చాంద్రాయణ గుట్ట మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ 201 కంటే ఎంఐఎంకి మెజార్టీ తగ్గింది. పాతబస్తీలో విజయం కోసం ఎంఐఎం ఇలా కష్టపడాల్సి రావడం ఇదే తొలిసారి. ఏకపక్షం అనుకున్న చోట గెలుపు కోసం ఇలా చెమటోడ్చాల్సి రావడం ఎంఐఎం నేతలకు కూడా మింగుడు పడని పరిణామం. ఓటింగ్ శాతం తక్కువగా నమోదుకావడంతో ఎంఐఎం అభ్యర్థులు కేవలం 35-40 శాతం ఓట్లతోనే విజయం నమోదుచేసుకున్నారు. పాతబస్తీలో తమ పార్టీకి ఓటింగ్ శాతాన్ని పెంచుకుని ఎంఐఎం జోరుకు బ్రేక్ వేయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు.
రాజకీయాల్లో ప్రత్యర్థుల బలహీనతలే మనకు ప్లస్ అవుతాయి. అందుకే పాతబస్తీలో ఎంఐఎం నేతల మధ్య అసఖ్యతను సొమ్ము చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అలాగే ఎంఐఎం, ఎంబీటీల మధ్య నెలకొన్న రాజకీయ వైరం తమకు కలిసొస్తుందని ఆశిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం నేతల మధ్య అసఖ్యత బయటపడింది. ఇదే అదునుగా గట్టిగా ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఏమీ ఉండదంటూ హైదరాబాద్‌లో తమ సత్తా చాటేందుకు కిందిస్థాయి నేతలకు బీజేపీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కింది స్థాయి నేతల మధ్య అసఖ్యతకు తావు లేకుండా ఆ పార్టీ నేతలు జాగ్రత్తపడుతున్నారు. అలాగే గత కొన్ని నెలలుగా నియోజక పరిధిలో వివిధ రకాల కార్యక్రమాలను ఆ పార్టీ నిర్వహిస్తోంది. పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. హైదరాబాద్ నియోజక వర్గాల్లో రెగ్యులర్‌గా పర్యటిస్తున్నారు.
వ్యూహాత్మకంగా మాధవి లత అభ్యర్థిత్వం ఖరారు..
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవి లతను ఎంపిక చేయడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. మాధవి లత హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్స్ ‘విరించి’ ఛైర్మన్. హైదరాబాద్ పాతబస్తీలోనే ఆమె పుట్టిపెరిగారు. నిజాం కాలేజీలో డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటిల్ సైన్స్‌లో పీజీ చేశారు. బలమైన హిందూ భావజాలం ఆమెది. హిందూ మత కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటారు. హైదరాబాద్ నియోజకవర్గంలో హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేందుకు ఆమెకున్న ఇమేజ్ దోహదపడుతుందని స్థానిక బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ప్రధాని మోదీ క్రేజ్ కూడా బీజేపీకి పెద్ద ప్లస్ అవుతుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
అదే సమయంలో లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్‌లో మాధవి లత పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన సేవా కార్యక్రమాలతో ముస్లీం మహిళా సంఘాలకు కూడా దగ్గరయ్యారు. నారీశక్తిని ఆస్త్రంగా ప్రయోగిస్తే పాతబస్తీలో ఎంఐఎం జోరుకు అడ్డుకట్ట వేయొచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాఖ్ రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళల్లో తమ పార్టీ పట్ల ఏర్పడిన సానుకూలత రానున్న ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని కమలనాథులు అంచనావేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలనాటికి హైదరాబాద్ పేరు మార్పు వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే. అటు బీజేపీ అభ్యర్థి మాధవి లత కూడా హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని తమ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతల చేరికలతో హైదరాబాద్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నేతలు గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ నియోజకవర్గం మొత్తం మీద ప్రభావం చూపే కొందరు వ్యక్తులపై కమలం పార్టీ ఇప్పటికే కన్నేసిందనే ప్రచారం జరుగుతోంది.
తన ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీని రజాకార్లతో పోల్చిన హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత.. ఒక రజాకార్ వల్ల పాతబస్తీ నాశనం అవుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ రజాకార్‌ను ఈ సారి తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఈ రజాకార్ వల్ల హిందువులు ఆడపిల్లలను అమ్ముతున్నారని..ముస్లిం ఆడపిల్లల్లి తొక్కేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పేదరికానికి మతం లేదంటున్న ఆమె.. తనకు పేద ముస్లీంలు కూడా ఓటు వేస్తారని ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్ ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా పాతబస్తీ యువతకు దాని ప్రయోజనాలు దక్కడం లేదన్నారు. పాతబస్తీ అభివృద్ధికి ఆమడదూరంలో నిలవడానికి మజ్లీసే కారణమని ఆరోపించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం చాలా తక్కువే నమోదయ్యింది. తమ ఓటు శాతాన్ని మెరుగుపరుచుకుంటే అసద్‌ను ఓడించడం పెద్ద విషయమేమీ కాదని కమలనాథుల భావిస్తున్నారు. పార్టీకి 10 శాతం ఓటింగ్‌ను పెంచుకునే లక్ష్యంతో గత కొన్ని మాసాలుగా ఆ పార్టీ దిగువ స్థాయి నేతలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా బూత్ స్థాయి వ్యూహాన్ని బీజేపీ నేతలు అమలు చేస్తున్నట్లు సమాచారం.
అలాగే ఎంబీటీ, కాంగ్రెస్ కూడా ఈ సారి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. ఇది తమ పార్టీకి ఏ మేరకు కలిసొచ్చే అవకాశముందని కమలనాథులు బేరిజు వేసుకుంటున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, మోదీ మానియా వంటి కారణాలతో హిందూ ఓటర్లు తమ వైపే మొగ్గుచూపుతారని బీజేపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అదే జరిగితే హైదరాబాద్‌లో కొత్త చరిత్రను లిఖించడం కష్టంకాదని చెబుతున్నారు.
తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 7 శాతం నుంచి 14 శాతానికి పెరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే 100 శాతం ఓటింగ్ శాతం పెరిగింది. ఈ ఓటింగ్ శాతాన్ని మరింత మెరుగుపరుచుకుని పార్లమెంటు ఎన్నికల్లో సత్తాచాటుతాం. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. – జీ కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
అయితే అసదుద్దీన్ ఒవైసీ కూడా సై అంటే సై అంటున్నారు. హైదరాబాద్‌లో బీజేపీని ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ఆయన ఇది వరకే ప్రకటించారు.