Khammam: ఖమ్మం లోక్ సభ స్థానం తెలంగాణ హాట్ సీట్‌గా ఎలా మారింది..?
Khammam Lok Sabha constituency: ఖమ్మానికి పొలిటికల్ గేట్ వే అని పేరు. తెలంగాణ మొత్తానిది ఒక దారి.. ఖమ్మంది మరో దారి అన్నట్టుగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాజకీయ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. తెలంగాణ మలి ఉద్యమం ఉధృతంగా సాగినా సరే.. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్, టీడీపీ వైపే ప్రజలు నిలబడ్డారు. 2014లో, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో టీడీపీ, వైసీపీ అభ్యర్ధులను గెలిపించారు ఇక్కడి ప్రజలు.
Khammam Lok Sabha constituency: ఖమ్మం లోక్ సభ స్థానంపైనే అందరి ఫోకస్ ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ తరపున తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. అటు కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నిలబడ్డారు. ప్రచారంలో ఎవరూ తగ్గడం లేదు. ముగ్గురూ విజయం కోసం పోరాడుతున్నారు. అటు పార్టీలు కూడా ఖమ్మం లోక్ సభ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఖమ్మం జిల్లా చారిత్రక, రాజకీయ, సామాజిక, భౌగోళిక నేపథ్యం చిన్నదేమీ కాదు.
ఖమ్మానికి పొలిటికల్ గేట్ వే అని పేరు. తెలంగాణ మొత్తానిది ఒక దారి.. ఖమ్మంది మరో దారి అన్నట్టుగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాజకీయ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. తెలంగాణ మలి ఉద్యమం ఉధృతంగా సాగినా సరే.. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్, టీడీపీ వైపే ప్రజలు నిలబడ్డారు. 2014లో, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో టీడీపీ, వైసీపీ అభ్యర్ధులను గెలిపించారు ఇక్కడి ప్రజలు. ఇంత వైవిధ్యానికి కారణం.. ఇది రాష్ట్ర సరిహద్దు జిల్లా కావడమే. ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ కు బోర్డర్ లో ఉంటుందీ జిల్లా.
తెలంగాణ మలి ఉద్యమ పోరాటం హోరుగా సాగింది. నిజమే. కాని, ఖమ్మం జిల్లాకి ఉన్న పేరే పోరాటాల గడ్డ. అందుకే, దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చూసిన ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్న తీర్పు ఇస్తుంటారు. జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఖమ్మం. సో, గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. అందులోనూ మావోల ప్రభావిత ప్రాంతం కూడా. ఎందుకంటే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న జిల్లా కావడంతో మావోల ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. సహజంగానే పోరాటాలకు ముందుండేది ఎర్రజెండానే. అందుకే, దశాబ్దాల పాటు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట అయింది. కొంతకాలం పాటు వారి ఆధిపత్యం ఇక్కడ బాగానే కనిపించింది. ఇప్పుడు కూడా పార్టీ ఉన్నా.. జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో లేదు.
ఖమ్మం జిల్లాకు మరో ప్రత్యేకత.. బొగ్గు గనులు. మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లిలో బొగ్గు గని కార్మికులు ఎక్కువ. కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సహజంగా పట్టు ఉండేది మళ్లీ కమ్యూనిస్టులకే. ఒక్క బొగ్గు గనులే కాదు.. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, స్పాంజ్ ఐరన్, నవ భారత్, ఐటీసీ, పేపర్ బోర్డ్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే, కార్మిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లా కూడా. ఓవైపు గిరిజనులు, మరోవైపు కార్మికులు.. కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లా నలువైపులా బలపడడానికి ఇదే ప్రధాన కారణం.
కమ్యూనిస్టుల అడ్డాగా పేరున్న ఖమ్మం జిల్లా క్రమంగా కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ హస్తవాసి పనిచేసింది. ఆయన సీఎం అయినప్పటి నుంచి ఖమ్మంలో కాంగ్రెస్ హవా పెరుగుతూ వచ్చింది. బలమైన కమ్యూనిస్టు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ రాకతో ఖమ్మంలో కాంగ్రెస్ మరింత బలపడింది. ఇక్కడ కాంగ్రెస్ బలపడింది అంటే అర్ధం.. క్రమంగా కమ్యూనిస్టులు, టీడీపీ కూడా బలహీనపడిందనే. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ.. క్యాడర్ పరంగా బలంగానే కనిపిస్తున్నా.. సీట్లు సాధించే స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. దీంతో ఆ బలగమంతా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోంది.
కాంగ్రెస్ ఎంట్రీకి ముందు టీడీపీ ఓ వెలుగు వెలిగింది. తెలంగాణ మలి ఉద్యమ సమయంలోనూ టీడీపీని గట్టిగానే ఆదరించారు ఇక్కడి ప్రజలు. కాని, ఖమ్మంలో ఎలాగైనా బలం పెంచుకోవాలనుకున్న అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి.. టీడీపీ, వైసీపీపై ఫోకస్ పెట్టింది. అంటే ఇక్కడ పార్టీల కంటే నాయకుల బలమే ఎక్కువగా కనిపిస్తుంది. నాయకులు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీకి బలం అన్నట్టుగా సమీకరణాలు మారాయి. అది ఆ తరువాతి కాలంలోనూ కొనసాగుతూ వచ్చింది.
ఖమ్మం జిల్లాను ఒక పొలిటికల్ సెంటర్‌గా చూడొచ్చు. ఇక్కడ గళమెత్తితే రీసౌండ్ ఆంధ్రలో వినిపిస్తుంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర.. ఈ రెండు ప్రాంతాలకు జాయింట్ పొలిటికల్ సెంటర్.. ఖమ్మం అని చెప్పాలి. అందుకే, జనాల్లో ఓ నానుడి ఉంది. మాది ఖమ్మం అని ఎవరైనా అనగానే.. ఆల్‌మోస్ట్ ఆంధ్రానే కదా అనేస్తుంటారు. తెలంగాణ మలి ఉద్యమం బీభత్సంగా సాగుతున్న సమయంలో కూడా.. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వని కాంగ్రెస్‌కు, రెండు రాష్ట్రాలూ ముఖ్యమేనన్న టీడీపీకి అక్కడి ప్రజలు పట్టం కట్టారు. ఆంధ్ర ప్రాంత రాజకీయ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించడమే దీనికి కారణం.
ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో 7 నియోజకవర్గాలు రిజర్వ్డ్ కేటగిరిలోనివే. కేవలం మూడు స్థానాలు మాత్రమే జనరల్ కేటగిరీలో ఉన్నాయి. కాని, జనరల్ క్యాటరిగీలో గెలిచిన వాళ్లే జిల్లా రాజకీయాలను చాలా వరకు శాసిస్తుంటారు. ఉదాహరణకు.. తుమ్మల నాగేశ్వరరావు. సీనియర్ లీడర్‌గా, మంత్రిగా జిల్లాపై పట్టు సాధించారు. ఆ తరువాత పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించగలిగారు. ఇక పొంగులేటి శ్రీనివాస్‌కు కూడా కనీసం నాలుగైదు నియోజకవర్గాలపై పట్టు ఉంది. ఇప్పుడు తుమ్మల, పొంగులేటితో పాటు మల్లు భట్టివిక్రమార్క కూడా వచ్చి చేరారు.
ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఉన్న బలం ఎంతంటే.. ఇక్కడి నుంచి సోనియా గాంధీని గనక పోటీలో నిలబెడితే.. కనీసం ప్రచారం కూడా చేయక్కర్లేదు. అంత ఈజీగా గెలుపు సాధ్యం అవుతుంది అని కాంగ్రెస్ నమ్ముతోంది. కాని, సోనియా గాంధీ లోక్‌సభకు పోటీచేయడం లేదు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. బట్.. సోనియా గాంధీని ఖమ్మం నుంచే పోటీ చేయించాలని అనుకోవడానికి కారణాలు లేకపోలేదు. ఖమ్మంలో కాంగ్రెస్‌కు బలం ఉండడంతో లోక్‌సభ స్థానంలో సునాయాసంగా గెలుస్తామన్న నమ్మకం ఆ పార్టీది. దానికి తోడు.. ఈ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ పై కూడా ఉంటుంది. సరిహద్దు జిల్లా కావడంతో.. కాంగ్రెస్‌కు కొంత ఊపు వస్తుందని భావించారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు జోష్ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఏపీ కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపింది. ఇదే సమయంలో సోనియా గాంధీని ఖమ్మం బరిలో దింపితే.. సరిహద్దు రాష్ట్రంలో కొంత ఓటు షేర్ పెంచుకోవచ్చన్నది కాంగ్రెస్ వ్యూహం. కానీ ఇప్పుడు సోనియా పోటీ చేయరని తేలిపోయింది.
పోరాటాల గడ్డ అని అనడమే గానీ.. ఈతరం వారికి ఖమ్మం జిల్లా ప్రజలు చేసిన పోరాటాల గురించి అంతగా తెలియదనే అంటారు. ఒకప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతాల్లో ఖమ్మం కూడా ఒకటి. రజాకార్లపై తిరుగుబాటు సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఖమ్మం జిల్లా యోధులు కీలక పాత్ర పోషించారు. ఈ జిల్లాలో గిరిజనులు, కార్మికులే కాదు.. రైతులు కూడా ఎక్కువే. రైతు కూలీలకు మద్దతుగా తెలంగాణలో ఉద్యమాలు జరిగినప్పుడు.. ఖమ్మంలో బలంగా ఉన్న వామపక్షాల నేతలే ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక ముదిగొండ మారణహోమం అయితే దేశవ్యాప్త చర్చకు దారితీసింది. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కావాలంటూ ధర్నా చేస్తుంటే.. విచక్షణారహితంగా, ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపడం అప్పట్లో సంచలనం అయింది. ముదిగొండ కాల్పుల ఘటనగా ఇప్పటికీ చెప్పుకుంటారు ఆ సంఘటనను.
ఇంతటి చరిత్ర ఉన్న ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు తమ పట్టు కోల్పోతూ వచ్చారు. ముఖ్యంగా 1980 తరువాత నాయకత్వం మారుతూ వచ్చింది. కొత్తగా వచ్చిన నాయకత్వం సమాజంలో వస్తున్న మార్పులను బ్యాలెన్స్ చేయలేకపోయిందనే వాదనుంది. దీంతో ఖమ్మం బరిలో నిలబడుతున్నా.. రాజకీయంగా పూర్తి స్థాయిలో ఆ బలాన్ని పెంచుకోలేకపోతోంది. అందుకే ఓటు-సీటు లెక్కల్లో వెనకబడింది. దీంతో ఆ స్థానాన్ని సంప్రదాయ రాజకీయ పార్టీలు భర్తీ చేస్తూ వచ్చాయి. ఇప్పుడైతే కాంగ్రెస్ కే గట్టి పట్టు ఉంది. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎలా మారతాయో చూడాలి.